విజయపుర కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి విజయం

మరి కొద్దీ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న సమయంలో, ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రమైన అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సందర్భంలో విజయపుర కార్పొరేషన్‌ ఎన్నికలలో విజయం లభించడం కర్ణాటక బీజేపీలో ఉత్సాహం కలిగిస్తున్నది. 
 
విజయపుర కార్పొరేషన్‌లోని 35 స్థానాలకు గాను బీజేపీ అత్యధికంగా 17 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొళ్లేగాల నగరసభలోని 7 వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా అందులో 6 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. 
 
ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న హావేరి జిల్లా శిగ్గావ్‌ శాసనసభా నియోజకవర్గం పరిధిలోని సవణూరు మున్సిపాల్టీలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందిస్తూ 2023 శాసనసభ ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచి కానున్నాయని జోస్యం చెప్పారు. 
 
తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లు ఫలితాల ద్వారా తిప్పికొట్టారని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పార్టీ ఎమ్మెల్యేలు యత్నాళ్‌, మహేష్‏ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలే అజండాగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 
 
కాగా ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు హర్షం వ్యక్తం చేశారు. తమపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్‌ కుమార్‌ సురానా  మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ భారత్‌జోడో యాత్రకు ప్రజలు దీటైన తీర్పునిచ్చారని కొనియాడారు. కాంగ్రెస్‌ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలీగ్‌ స్థాయికి దిగజారుతోందని ధ్వజమెత్తారు.