కెటీఆర్ చెప్పిన వ్యక్తుల అకౌంట్లలోకి డబ్బు జమ జరగలేదు 

మంత్రి కేటీఆర్ చెప్పిన వ్యక్తుల పేర్లలోని బ్యాంకు అకౌంట్లలోకి అక్టోబర్ 16 నుంచి 29వ తేదీ వరకూ ఎలాంటి డబ్బులు జమ కాలేదని బిజెపి ఎమ్యెల్యే ఎన్  రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ డబ్బులు జమ అయితే.. ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాయో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు టీఆర్ఎస్ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరి పేర్లు మీడియా ఎదుట చెప్పారో వారందరికీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
‘సుశీ ఇన్ ఫ్రా’ కంపెనీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని రావు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
ఉప ఎన్నిక సందర్భంగా ‘సుశీ ఇన్ ఫ్రా’ కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తులకు దాదాపు రూ.2 కోట్ల వరకు నగదును బదలాయించారంటూ ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కూడా ‘సుశీ ఇన్ ఫ్రా’పై మంత్రి కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు.
 
ఓట్ల కోసం టీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను వదిలిపెట్టేది లేదని, ఈనెల 3వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ పూర్తైన తర్వాత కూడా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందంటూ కొన్ని తీర్పులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉదహరించారు. 
 
ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నాయకుల ఫోన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాంపరింగ్ చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డే ఒక ఉదహరణ అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎవరి ఫోన్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.