వంతెన కూలిన ఘటనలో కాంట్రాక్టర్ తో సహా 9 మంది అరెస్ట్

గుజరాత్‌లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసినట్టు రాజ్‌కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, టికెట్ క్లర్కులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 141 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు. 
 
అరెస్ట్ అయిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు అశోక్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమైన తర్వాత మరింత మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారని పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
మరణించిన వారిలో 47 మంది పిల్లలున్నారు. వీరిలో అత్యంత కనిష్ఠ వయసున్న రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నది.  కేబుల్‌ బ్రిడ్జీ కూలిన దుర్ఘటనపై ఫోరెన్సిక్‌ నిఫుణులు దర్యాప్తు చేస్తున్నారు. వంతెన నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. వంతెన పాతది కావడం, తీగలు బలహీనంగా ఉండటం, వంతెనపైకి ఎక్కువ మంది ఎక్కడం వంటి కారణాల వల్ల అది కూలినట్లు భావిస్తున్నారు.