అత్యాచార బాధితులకు రెండు వేళ్ల పరీక్ష పట్ల `సుప్రీం’  ఆందోళన

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష (యోని లాక్సిటీని తెలుసుకోవడానికి చేసే పరీక్ష) ఇప్పటికీ సమాజం నుంచి పూర్తిగా దూరం కాకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది  దారుణం, దుర్మార్గమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇది ఒక కాలం తీరిన పాలకాలపు పరీక్షా పద్ధతి అని, స్త్రీలపట్ల వివక్షకు నిదర్శనమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని జార్ఖాండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ, దోషిగా నిర్ధారించిన ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ సందర్భంగా, రెండు వేళ్ల పరీక్షలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అత్యాచార నిర్ధారణకు వైద్యులు ‘రెండు వేళ్ల’ పరీక్షను నిర్వహించడం అత్యంత అమానవీయమని, ఈ పరీక్ష బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమని పేర్కొంటూ 2013 మేలో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ప్రస్తావిస్తూ, ఇప్పటికీ సమాజంలో ఏదో ఒక చోట ఇలాంటివి చోటుచేసుకుంటుండటం దురదృష్టకరమని పేర్కొంది.

లైంగికంగా చురుకుగా ఉన్న మహిళ అత్యాచారానికి గురికాదని చెప్పలేమని అభిప్రాయపడింది. రెండు వేళ్ల పరీక్షల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. టు ఫింగర్స్ టెస్ట్ జరక్కుండా చూడాలంటూ ఆయా రాష్ట్రాల డీజీపీలు, హెల్త్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో రేప్‌ బాధితులపై ఇలాంటి వివక్షపూరిత పరీక్షలు జరగకుండా కేంద్ర సర్కారు అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యక్తిగతంగా ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.  అలాగే, టూ ఫింగర్స్ పరీక్షలకు సంబంధించిన విద్యా విషయక సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల పాఠ్యాంశాల నుంచి తొలగించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.