ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ లో 40 మంది పాక్ ఉగ్రవాదుల హతం

ఈ ఏడాది కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన వివిధ ఆపరేషన్లలో 40 మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న కాశ్మీరీలపై హింసాత్మక ప్రతిస్పందనను రెచ్చగొట్టడానికి ఉగ్రవాదులు స్థానికేతరులను, చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని డిజిపి చెప్పారు.

లోయలో పనిచేస్తున్న చాలా ఉగ్రవాద సంస్థల నిర్మాణాలు ధ్వంసమయ్యాయని సింగ్ స్పష్టం చేశారు. “వారి నాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకు పోయింది. పాకిస్తాన్ ఏజెన్సీలు ఎక్కువగా జైష్,  లష్కర్ ఆదేశాన్ని పాకిస్తానీ ఉగ్రవాదుల చేతుల్లో ఉంచడానికి ప్రయత్నిస్తాయి, తద్వారా వారు ఇక్కడ కార్యకలాపాలను నేరుగా నియంత్రించవచ్చు” అని తెలిపారు. 

ఈ సంవత్సరం యువకులను తప్పుదారి పట్టించడానికి, శాంతిని ధ్వంసం చేయడానికి, ప్రాణాలకు, ఆస్తికి నష్టం కలిగించడానికి ఇక్కడకు వచ్చే బయటి ఉగ్రవాదులపై తాము దృష్టి సారించినట్లు డిజిపి తెలిపారు. ఆ సందర్భంలో, అనేక విజయవంతమైన ఆపరేషన్‌లు జరిగాయి, ఇందులో 40 మంది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు వేర్వేరు ఆపరేషన్‌లలో హతమయ్యారని ఆయన వివరించారు. 

పాకిస్థాన్‌కు చెందిన మరికొంత మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. “కొన్ని కొత్త గ్రూపులు (ఎల్‌ఓసి) దాటిన తర్వాత క్రియాశీలకంగా ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మేము విజయవంతం అవుతామని నేను ఆశిస్తున్నాను” అని  దిల్బాగ్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు.   

గత సంవత్సరాలతో పోల్చితే చొరబాట్లు అదుపులో ఉన్నాయని, అయితే పాకిస్తాన్ రెడీమేడ్ ఐఇడిలను నెట్టడానికి ప్రయత్నిస్తోందని పోలీసు చీఫ్ చెప్పారు. ”సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజౌరి, పూంచ్‌లలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదేవిధంగా బారాముల్లా, కుప్వారాలో కూడా ప్రయత్నాలు విఫలమయ్యాయి” అని తెలిపారు. 

అలాగే కొన్ని ఆపరేషన్లలో, తాము ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న డజన్ల కొద్దీ ఐఈడీలను తిరిగి పొందాముని, అయితే దురదృష్టవశాత్తు, ఈ రెడీమేడ్ ఐఈడీలను ఉపయోగించిన కొన్ని సంఘటనలు జరిగాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూలో కొంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. 

ఉదంపూర్‌లోని బస్సుల్లో రెండు రకాల పేలుళ్లు సంభవించగా, అంతకుముందు ఈ జిల్లాలో కూరగాయల మార్కెట్‌లో పేలుడు సంభవించింది. అలాగే, ఇంతకుముందు బస్సులో ఒక సంఘటన జరిగిందని వివరించారు.  మారుతున్న వాతావరణంతో మంచు కురిసే లోపు మరింత మంది చొరబాటుదారులను లోపలికి నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతాయని డిజిపి చెప్పారు.

“పాకిస్థాన్ ఏజెన్సీలు మరింత మంది ఉగ్రవాదులను నెట్టడానికి ప్రయత్నిస్తాయి. కానీ మన సరిహద్దు భద్రతా గ్రిడ్ బలంగా ఉంది. అందుకే ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు బెడిసికొట్టాయి” అని స్పష్టం చేశారు.