జీడీపీ వృద్ధిరేటుకి సహకరిస్తున్న యూట్యూబ్ క్రియేటర్లు

దేశ జీడీపీ వృద్ధిరేటులోయూట్యూబ్ క్రియేటర్లు తమ వంతు సహకారం అందిస్తున్నారు.  ప్రతీ ఏడాది రూ.6,800 కోట్ల ఆదాయం సమకూర్చడంతో పాటు 7 లక్షల ఉద్యోగాలు కలిపిస్తున్నారని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ వెల్లడించారు.
 
 ‘టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ సొసైటీ’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ యూ ట్యూబ్ క్రియేటర్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. క్రియేటర్లకు యూట్యూబ్ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, సొంతంగా బిజినెస్ చేసుకునేందుకు పరోక్షంగా సాయం చేస్తున్నదని వివరించారు. 
 
అలాగే ఆడియన్స్ను కూడా పెంచుకునే అవకాశం ఇస్తోందని చెబుతూ  యూట్యూబ్ ప్లాట్ఫాంపై అన్నిరకాల వ్యాపారాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. చిన్న చిన్న బిజినెస్ ప్లాట్ఫాంలో యాడ్స్ ద్వారా యూట్యూబ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నదని నీల్ మోహన్ వివరించారు.
దాదాపుగా దేశంలో మాట్లాడే అన్ని భాషల్లో యూట్యూబ్ సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. కంటెంట్ క్రియేటర్లతో పాటు యూజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భారత దేశం మొత్తంలో కంటెంట్ క్రియేటర్స్ ముందుగా ఎంచుకునేది యూట్యూబ్ అని చెప్పారు.
ఒక్క కంటెంట్ క్రియేటర్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తాడని, అందుకే ప్రభుత్వం ఈ ప్లాట్ఫాంపై ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సహజమని వివరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంటెంట్ క్రియేటర్లు, ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్పై కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తమ అభిప్రాయాలను షేర్ చేసుకునేందుకు యూట్యూబ్ ఓ వేదిక అని చెప్పారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి, హింసను నిరోధించడంలో తమ విధానం స్పష్టంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు.