
తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) గురువారం చేపట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 23న తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో కోయంబత్తూరులో ఒక మారుతీ 800 కారులో ఎల్‌పిజి సిలిండర్ పేలుడు సంభవించింది.
కొట్టై ఈశ్వరన్ ఆలయ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 25 ఏళ్ల జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర డిజిపి శైలేంద్ర బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ పేలుడు వెనుక కుట్ర కోణం దాగి ఉన్నట్లు వెల్లడించారు. ఉగ్ర దాడులలో పేలుళ్ల కోసం సాధారణంగా ఉపయోగించే మేకులు, గోలీలు, ఇతర వస్తువులు కారులో లభించినట్లు ఆయన తెలిపారు.
మృతుడు ముబిన్ ఇల్లును సోదా చేయగా నాటు బాంబుల తయారీకి ఉపయోగించే తక్కువ తీవ్రతతో కూడిన పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పొడి, బొగ్గు, సల్ఫర్ లభించినట్లు ఆయన చెప్పారు. కొన్ని సిసిటివి ఫుటేజ్‌ల ఆధారంగా ఐదుగురు వ్యక్తులను యుఎపిఎ కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వీరిలో కొందరు గతంలో కేరళను సందర్శించారని, 2019లో వీరిని ఎన్‌ఐఎ ప్రశ్నించిందని కోయంబత్తూరు కమిషనర్ బాలకృష్ణన్ తెలిపారు. కారు పేలుడు ఘటన నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలడంతో కేసు విచారణ ఎన్‌ఐఏకి అప్పగించడమే సమంజసంగా ఉంటుందని భవిస్తూ ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ ఆ మేరకు అధికారులను ఆదేశించారు.
అదే విధంగా కోయంబత్తూరులో భద్రత మరింత పెంచేలా కరుంబుకడై, సుందరపురం, గౌండమ్‌పాళయం వద్ద కొత్త పోలీసుస్టేషన్లను తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇలాంటి పేలుళ్లు సంభవించకుండా ఉండేందుకు పోలీసు శాఖలో ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అంతేగాక కోయంబత్తూరు సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో జనసమర్థమైన ప్రాంతాల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
బాంబు దాడులు తదితర హింసాత్మక సంఘటనలపై ముందస్తు సమాచారమిచ్చేవారికి తగు భద్రత కల్పించాలని కూడా సీఎం నేతృత్వంలోని సమావేశం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
కోయంబత్తూరులో దీపావళి సందర్భంగా రైల్వేస్టేషన్, కలెక్టర్ కార్యాలయం వంటి ఐదు చోట్ల బాంబులు పేల్చాలని జమీషా ముబిన్ కుట్ర పన్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల అతడి ఇంటిలో లభించిన ఓ రహస్యడైరీలోని సమాచారం మేరకు జమీషా ముబిన్ కోయంబత్తూరు నగరంలో బాంబు దాడులు జరిపేందుకే 70 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను సేకరించి తన ఇంటిలో దాచినట్లు తేలింది.
యూట్యూబ్ ద్వారా బాంబులను తయారు చేసే పద్ధతులను కూడా తెలుసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కోయంబత్తూరు నగరంలో దీపావళి పండుగ వేడుకలను పూర్తిగా భగ్నం చేయడానికి గాను రైల్వేస్టేషన్, కలెక్టర్ కార్యాలయం, కార్పొరేషన్ విక్టోరియా హాలు, రేస్‌కోర్స్, పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద బాంబు పేలుళ్లు జరపాలని ముబిన్ కుట్రపన్నాడు.
ఈ ఐదు ప్రాంతాలను డైరీలో రాసి వాటి పక్కనే ఆంగ్లంలో ‘హిట్ లిస్ట్’ అని కూడా రాసాడు. దానిని అమలు పరిచేందుకు మారుతీ కారులో పేలుడు పదార్థాలను నింపుకుని తమ లక్ష్యం దిశగానే ఈ నెల 23వ తేదీ అతను బయలుదేరి వుంటాడని, ఈ లోగా సిలిండర్ పేలివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీల ప్రకారం జమీషా ముబిన్ నడుపుతున్న కారును ఉక్కడం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే భయంతో జమీషా ముబిన్ కారు వేగంగా నడుపుకుంటూ వెళ్ళాడు.
తనను అరెస్టు చేస్తారనే భయంతో అతను గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి ఆత్మహుతి చేసుకుని వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కారు సిలిండర్ పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు చెన్నైకి చెందిన ఎన్‌ఐఏ అధికారులు కోయంబత్తూరు చేరుకున్నారు. ఎన్‌ఐఏ డీఐజీ వందన, సూపరింటెండెంట్ శ్రీజిత్ తదితరులు పేలుడు ప్రాంతం వద్ద విచారణ జరిపారు. ఆ తర్వాత జమీషా ముబిన్ ఇంటిలో పట్టుబడిన పేలుడు పదార్థాలను పరిశీలించారు.
ఈ సంఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు పరిగణించాలని డిమాండు చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై దీనిపై ఎన్‌ఐఎ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగపూర్ హింసాకాండపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం