ఐక్యరాజ్యసమితి అధికారభాషల్లో చేరనున్న హిందీ!

ఐక్యరాజ్యసమితి అధికారభాషల్లో హిందీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ భాషలు ఐక్యరాజ్యసమితి అధికారభాషలుగా ఉన్నాయి. త్వరలో హిందీని కూడా అధికారభాషగా చేసేందుకు భారత్ యత్నాలు ముమ్మరం చేసింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంలో హిందీ వాడుకపై ఇప్పటికే ఎంఓయూ ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని యునెస్కోకు సంబంధించి ఇప్పటికే హిందీని సోషల్ మీడియాలోనూ, న్యూస్ లెటర్లలోనూ వాడుతున్నామని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించి కూడా త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల వల్ల జూన్ 21ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. 2014 నుంచి అనేక దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. చిరుధాన్యాలపై కూడా భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టిని ఆకర్షించింది. ఆయుర్వేదంపై కూడా ఐక్యరాజ్యసమితితో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుల కోసం యత్నిస్తోంది.
సుష్మ స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పటి నుండి ఐక్యరాజ్యసమితిలో అధికార భాష హోదా హిందీకి కల్పించడం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తున్నది. తొలి విజయంగా ఐక్యరాజ్యసమితి వెబ్ పోర్టల్ రేడియోలో హిందీలో ప్రసారాలు ఆరంభించేటట్లు ఆమె చేయగలిగారు.
మొదటిసారిగా, 1970వ దశకంలో విదేశాంగ మంత్రిగా వాజపేయి హిందీలో ఐక్యరాజ్యసమితి  సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. 2007లో 8వ ప్రపంచ హిందీ మహాసభలు న్యూయార్క్ లో జరిపినప్పుడు ప్రారంభ సమావేశాలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో  జరిపారు.  అదే తరహాలో కేంద్రం ప్రస్తుతం హిందీపై దృష్టిసారించడంతో ఐక్యరాజ్యసమితి త్వరలోనే హిందీని అధికారిక భాషగా గుర్తించే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.