ఉక్రెయిన్ డర్టీ బాంబుల ప్రయోగానికి దిగుతోందని రష్యా ఆరోపణ

తమపై ఉక్రెయిన్ అత్యంత కీలకమైన ప్రమాదకరమైన ఉగ్రవాద చర్యల డర్టీ బాంబుల ప్రయోగానికి దిగుతోందని రష్యా ఆరోపించింది. బుధవారం ఉదయం రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగ్యూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ భయానకమైన జీవ రసాయనిక ఆయుధాల సమ్మేళనం అయిన డర్టీబాంబుల తయారీ పూర్తి చేసుకుని వాటిని వాడుతోందని సెర్గీ ఆరోపించారు. 

ఇది డర్టీ బాంబు దశ అయిందని వ్యాఖ్యానించారు. భారత రక్షణ మంత్రి, ఇతర కీలక దేశాల రక్షణ మంత్రులతో కూడా రష్యా మంత్రి మాట్లాడారు. నాటో దేశాలు తమపై అణ్వాయుధాల ప్రయోగం ఆరోపణలకు దిగుతున్నాయని, అయితే డర్టీ బాంబు ప్రయోగం కప్పిపుచ్చుకునేందుకు తమపై లేనిపోని అసత్యాలకు దిగుతున్నారని చైనా విదేశాంగ మంత్రికి కూడా రష్యా మంత్రి తెలిపారు. 

ప్రత్యేకించి భారతదేశ రక్షణ మంత్రికి ఫోన్ చేసి ఎక్కువ సేపు మాట్లాడిన సెర్గీ డర్టీ బాంబు వాడకం అత్యంత ప్రమాదకరమని, ఇది మానవాళికి ముప్పు తెచ్చిపెడుతుందని ఆరోపించారు. అయితే ఇది అసత్య ఆరోపణ అని ఇటువంటివి ప్రమాదకర వార్తలు అని ఉక్రెయిన్ అధికారికంగా ఖండించింది.

యుద్ధ రంగంలో తన అతిక్రమణలను దాచిపెట్టేందుకు రష్యా ఇటువంటి ఆరోపణలకు దిగిందని ఉక్రెయిన్ విమర్శించింది. అణుధార్మికత, జీవరసాయనిక ప్రభావిత, రసాయన ఆయుధాల మిళితమైన అత్యంత శక్తివంతమైన బాంబులను సాధారణ బాంబుల శ్రేణులలో మిళితం చేసి వాడటాన్ని డర్టీ బాంబు అటాక్ అంటారు.

ఇటువంటి బాంబుల పాటవం అతి కొద్ది దేశాలకు ఉంది. రష్యా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటి యుద్ధం తీవ్రత, ఇది ప్రమాదకరమైన దారి పడుతున్న వైనం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఏ పక్షం కూడా మానవాళికి ముప్పు తెచ్చిపెట్టే ఆయుధాల ప్రయోగానికి దిగరాదని, ఇంతకు ముందటి చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఏ యుద్ధ పక్షం కూడా అణ్వాయుధ స్థితికి పరిస్థితిని దిగజార్చరాదని సూచించారు. అణ్వాయుధాలు కానీ రసాయనిక జీవరసాయనిక ఆయుధాలు కానీ విలయాన్ని సృష్టిస్తాయని హెచ్చరించారు.

ముందు ఉభయ పక్షాలు ఇప్పటి ఘర్షణల నివారణకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంప్రదింపులు, దౌత్యనీతిని ప్రదర్శించాలని కోరారు. అయితే డర్టీ బాంబుల ప్రయోగానికి ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించిందని తమకు ఇంటలిజెన్స్ సమాచారం అందిందని మాస్కో వర్గాలు రాజ్‌నాథ్‌కు తెలిపాయి.

మరోవంక, రష్యా బుధవారం అణువిన్యాసాలు చేపట్టింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా వీటిని పర్యవేక్షించారు. అణు విన్యాసాల్లో భాగంగా బాలిస్టిక్‌, క్రూయిజ్‌ మిస్సైల్స్‌ను రష్యా పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్టు రష్యా తెలిపింది. నాటో అణువిన్యాసాలను చేపడుతున్న సమయంలోనే రష్యా ఈ డ్రిల్స్‌ చేపట్టడం గమనార్హం.

 ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేయడంతోపాటు ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలకు సరఫరా చేయాలని  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు . ఆయుధాల ఉత్పత్తి ఆలస్యం కావడం, ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాలు చేజారుతున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి, సరఫరా, రష్యాన్‌ బలగాలకు పంపిణీ వేగవంతం చేయాలని, అన్ని ప్రాంతాల్లో బలగాలు సన్నద్ధంగా ఉండటం అత్యవసరమని స్పష్టం చేశారు.
 
 ఉక్రెయిన్‌లో మోహరించిన సైన్యానికి మెడికల్‌ కిట్స్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వంటి కనీస వస్తువులు కూడా అందించడం లేదని మీడియా పేర్కొంది. ఉక్రెయిన్‌ వైమానిక బలగాలను నిర్వీర్యం చేయడానికి రష్యా డ్రోన్లను ప్రయోగిస్తోందని బ్రిటన్‌ రక్షణ శాఖ పేర్కొంది. రష్యా దీర్ఘ శ్రేణి ఆయుధ ట్యాంకులు క్షీణిస్తున్నాయని వెల్లడించింది. 
 
రష్యా ఆయుధ సంపత్తిలో క్షీణతను వైమానిక, క్షిపణి, డ్రోన్స్‌ దాడుల ప్రయోగం ప్రతిబింబిస్తోందని, దీంతో వ్యూహాత్మక సైన్య లక్ష్యాలను సాధించడంలో రష్యా ప్రభావం తగ్గుతోందని వాషింగ్టన్‌ డిసికి చెందిన ఓ సంస్థ పేర్కొంది.