టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో హైడ్రామా నడిచింది. ఈ విషయపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు సమాచారమిచ్చారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులతో తమను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సీపీ తెలిపారు.
 
నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లతో పీఠాధిపతి రామచంద్ర భారతి, బీజేపీ నేత నందకుమార్, సింహయాజులు బేరసారాలు ఆడుతుండగా పోలీసులు ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. 
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఫాంహౌస్ పై దాడి చేశామని తెలిపారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.
 
 రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని, వీరిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని తెలిపారు.
 
అయితే, అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసేందుకు బిజెపి ట్రై చేసిందనే వార్తలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రూ.100 కోట్లు తమ దగ్గర ఎక్కడి అని , అయినా, వాళ్లు  రూ. 100 కోట్ల రూపాయల ఖరీదైన వ్యక్తులా అని ఆయన ఎద్దేవా చేశారు. 
 
 అలాంటి అవసరం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఒక నాటకాన్ని తలిపిస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఘటనపై సీబీఐతో మాత్రమే కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
 
‘‘ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేసిందంటూ కొత్త నాటకాలకు తెరతీశారు. ఏమిటీ డ్రామా ? కేసీఆర్ చెప్పే కట్టుకథలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు” అంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి కె అరుణ ధ్వజమెత్తారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో మళ్లీ గెలిచే సత్తా ఎవరికీ లేదని అంటూ అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆమె స్పష్టం చేశారు.
 
‘‘మునుగోడు బైపోల్ తేదీ సమీపించిన ప్రస్తుత తరుణంలో కేసీఆర్, కేటీఆర్ ఆడుతున్న కొత్త నాటకమిది. ఆ తండ్రి,కొడుకులకు ఇలాంటి చెత్త వ్యవహారాలు, దిగజారుడు రాజకీయాలు కొత్తేం కాదు. రాజకీయ మనుగడ కోసం టీఆర్ఎస్ చేస్తున్న దుష్ట రాజకీయాలను, అవాస్తవ ప్రచారాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు.  
 
ఈ డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌, హీరో, విలన్‌.. అంతా టీఆర్ఎస్ వాళ్లేనని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఆరోపించారు.  కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అయినట్టు, టీఆర్ఎస్ ఆడిన ఈ డ్రామా ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడి ఫామ్‌హౌస్‌, డబ్బులు, యంత్రాంగం, పోలీసులు అంతా వాళ్ల మనుషులేనని ఆయన చెప్పారు.
కేవలం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే  ఆ పార్టీ వాళ్లు ఇదంతా చేస్తున్నారని డా. లక్ష్మణ్ మండిపడ్డారు.  ప్రచారానికి మిగిలిన ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా ఎన్ని కథలు సృష్టిస్తారో చూడాలని చెప్పారు. ‘‘గతంలో కూడా మంచి స్టోరీ చూశాం. ఓ మంత్రిని హత్య చేసేందుకు రూ.కోట్లు సుపారీ ఇచ్చారని  కథ అల్లారు. ఆ కథ కంచికేనా? దానికి కారకులైన వారు టీఆర్ఎస్ ప్లీనరీలో సెల్ఫీ దిగిన ఉదంతాలను చూశాం’’ అని ఎంపీ లక్ష్మణ్ గుర్తుచేశారు.
 ‘‘మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకింత ఆక్రోశం. ఇలాంటి కట్టు కథల ద్వారా ప్రజల దృష్టిని మరల్చలేరు’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.   
 
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బుధవారం రాత్రి జరిగిన హైడ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా సీఎం కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు రెండు టీవీ చానళ్లతో కలిసి ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
‘‘కేసీఆర్ కు దమ్ముంటే… ఈ వ్యవహారానికి సంబంధించి ఫామ్​హౌస్​లో, హోటల్ లో, ప్రగతి భవన్ లో గత వారం రోజులుగా జరిగిన సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు. 
 
ఇదే విషయంపై తనతో పాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే… భార్యాపిల్లలతో వచ్చి ప్రమాణం చేయాలని సంజయ్​ సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు.