పాక్ గూఢచారి మహిళా వలలో చిక్కి జైలుపాలైన మీనా

ఢిల్లీలోని సేనా భవన్‌లో నాలుగవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేసిన నేరానికి జైలుపాలైన 31 ఏళ్ల రవిప్రకాశ్ మీనా తనను వలపు వలలో దింపిన మహిళ పాకిస్తానీ గూఢచారి అన్న వాస్తవాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. 
 
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఆ యువతితో మీనా గాఢంగా ప్రేమలో పడ్డాడని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారుల బృందం సభ్యుడు ఒకరు వెల్లడించారు. రాజస్థాన్ కరోలీ జిల్లాలోని సపోతరకు చెందిన మీనా సేనా భవన్‌లో నాలుగవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అక్టోబర్ మొదటివారంలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
ఐఎస్‌ఐతోసహా పాకిస్తానీ మహిళా గూఢచారుల వలలో చిక్కుకుని దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కొందరు చేరవేస్తున్నట్లు నమోదైన కేసులో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో మీనా 35వ వ్యక్తి. 
 
తన పేరు అంజలీ తివారీగా పరిచయం చేసుకున్న పాకిస్తానీ మహిళా గూఢచారి తాను పశ్చిమ బెంగాల్‌లో పనిచేస్తున్న భారత సైనికాధికారినని మీనాతో చెప్పింది. సైన్యానికి చెందిన కీలక, సున్నితమైన సమాచారాన్ని మీనా ఆ మహిళతో పంచుకున్నాడని ఆ అధికారి చెప్పారు. 
 
సమాచారాన్ని అందచేసినందుకు మీనా బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ అయిందని అ అధికారి తెలిపారు. అక్టోబర్ 8న మీనా అరెస్టు కాగా, తాను పాక్ గూఢచారి వలలో చిక్కుకున్నానన్న విషయాన్ని అతను నమ్మలేకపోతున్నాడని ఆయన చెప్పారు.