రాముడిని వర్ణిస్తూ వేదికపైనే కన్నుమూసిన కథకుడు

బిహార్‌లో హనుమాన్‌ జయంతి సందర్భంగా తులసీదాస్‌ రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అదే వేదికపై ప్రాణాలొదిలారు. రాముడి కథ చెప్తూ చెప్తూ గుండె పోటుకు గురై కుప్పకూలాడు. వెంటనే నిర్వాహకులు సమీపంలోని దవఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 
ఈ విషాద ఘటన బిహార్‌లోని ఛాప్రాలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లైవ్‌గా ప్రసారం చేస్తుండటంతో ఆయన మృతిచెందిన విషయం దావానలంలా పాకిపోయింది. సోషల్‌ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్‌గా మారింది.
 
ఛాప్రా నగరంలోని మారుతీ మానస్‌ ఆలయంలో హనుమాన్‌ జయంతిని నిర్వహిస్తున్నారు. వేడుకల చివరి రోజు శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రణంజయ్‌సింగ్‌ తులసీదాస్‌ రామాయణంలోని దోహాలు వినిపిస్తూ రాముడి గుణగణాలు చెప్తున్నారు. 
 
ఎంతో శ్రద్ధగా రాముడి కథ చెప్తూ చెప్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో చేతిలో మైక్‌తోనే వెనక్కి కుప్పకూలిపోయాడు. వెంటనే నిర్వహాకులు స్థానిక దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
 
ఆలయంలో అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ గుండెపోటుతో చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున పుర ప్రజానీకం వచ్చి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. దేవుడి పేరు చెప్తూనే కన్నుమూయడంతో ఎంతో పుణ్యం చేసుకున్నారంటూ స్థానికులు కొనియాడారు.