ఎల్‌వీ-ఎం 3 రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం

శ్రీహరికోటలోని  సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 23న జీఎస్ఎల్‌వీ-మార్క్‌ 3 (ఎల్‌వీ-ఎం 3) రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)వన్‌వెబ్‌ ఇండియా-1 పేరుతో యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి పంపనున్నారు.
 
ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం శుక్రవారం  జరగనుంది.ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాకెట్‌ పనితీరు తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. 
 
ఎంఆర్‌ఆర్‌ అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశమవుతారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 21న అర్ధరాత్రి తరువాత అనగా 2న 12.07గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించ నున్నారు. 
 
కౌంట్‌డౌన్‌ 24గంటలు కొనసాగిన అనంతరం ఈ నెల  22న అర్ధరాత్రి తరువాత అనగా 23న 12.07గంటలకు జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది.  న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్ఐఎల్‌) కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగం చేపట్టుతోంది. 
 
5,200కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ కక్ష్యలోకి చేర్చనుంది.రాకెట్‌ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనుంది. మూడు దశలు కలిగిన జీఎస్ఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ 43.43మీటర్ల పొడవు కలిగి 640టన్నుల బరువు కలిగి ఉంటుంది.
 
 మొదటి దశలో 200టన్నుల బరువు గల ఘన ఇంధన స్ట్రాఫాన్ల బూస్టర్లను కలిగి ఉంటుంది. రెండో దశలో 110టన్నుల బరువు ధ్రవ ఇంధనం కలిగి ఉంటుంది. మూడో దశలో అతి శీతల క్రయోజనిక్‌ ఇంధనం 25టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఘన, క్రయో ఇంధనాలను ఇప్పటికే నింపి ఉంచారు. ధ్రవ ఇంధనం మాత్రం కౌంట్‌డౌన్‌ జరిగే సమయంలో నింపి ఎలక్ర్టానిక్స్‌ వ్యవస్థలతో పాటు గ్లోబల్‌ పరీక్షలు చేసి ఏవైన లోటుపాట్లుంటే సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. 
 
అత్యంత శక్తివంతమైన ఎస్‌-200 బూస్టర్ల సాయంంతో రాకెట్‌ భూమి నుంచి నింగివైపు పయనమవుతుంది. ఇంత బరువు కలిగిన రాకెట్‌ కావడంతో అంతరిక్షంలోకి నిటారుగా వెళ్లి ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి సులువుగా చేరుస్తుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్‌ సిబ్బంది ఉపగ్రహాలను తమ ఆధీనంలోకి తీసుకొని నియంత్రించుకుంటారు.