టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలే..జనసేనతో బిజెపి పొత్తు

జనసేనతో బిజెపి పొత్తు ఇకపై కూడా కొనసాగుతుందని బిజెపి జాతీయ కార్యదర్శి ఏపీ కో..కన్వీనర్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలేనని ధ్వజమెత్తారు. .. వైసీపీ – టీడీపీల్లో ఒకరు నాగరాజు.. మరొకరు సర్పరాజు అంటూ యెద్దేవా చేశారు.
 
కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లపై సోము వీర్రాజు స్పందించారని, ఈ విషయంలో అంతకు మించి తాను మాట్లాడేది ఏమీ లేదని పేర్కొన్నారు. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. విశాఖలో జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ తో చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడారని, సంఘీభావాన్ని తెలిపారని తెలిపారు. 
కన్నా వాఖ్యలపై స్పందించను… సోము 

ఇలా ఉండగా, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ‌ పార్టీలో చాలా పెద్దలని.. ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనని రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు పేర్కొన్నారు. ఆయనేదో అన్నారని… తాను అన్నింటికీ స్పందించబోనని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడతానని స్పష్టం చేశారు. 

రోడ్ మ్యాప్ పవన్ అడుగుతున్నారని.. దానిని తమ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. పవన్‌కు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ బీజేపీ, జనసేన కలిసే ముందుకు‌ వెళతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కలసినందు వల్ల మీడియా ఎక్కువ కంగారు పడుతోందని  వీర్రాజు అభిప్రాయపడ్డారు. 

తమ నాయకుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలిసి సంఘీభావం తెలిపారని చెప్పారు. తమ నాయకుడిని చంద్రబాబు కలవడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని ఆరోపించారు.

చంద్రబాబు హయాంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. తన హయాంలో జరిగిన విషయాలను చంద్రబాబు గర్తుంచుకుంటే మంచిదని హితవు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే పేరుతో చేసే ఉమ్మడి ఉద్యమం అంశంపై మీడియా అనవసరంగా బిజెపిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పారు.

రాజకీయాల్లో అన్నీ ఉంటాయని.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లను కూడా ఇదే కోణంలో చూస్తామని తెలిపారు. పవన్ తో కలిసి పని చేస్తామని తెలిపారు. జనసేనతో కలిసి రూట్ మ్యాప్ ను తయారు చేసుకుంటామని వీర్రాజు చెప్పారు.