టిటిడికి 10 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్ )పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనుంది. సామాన్యులకు నాణ్యమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో భక్తుల కోసం ఈ బస్సులను తిరుమల కొండపైన నడపనున్నారు.

ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే వీ ప్రదీప్ శుక్రవారం టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశమయ్యారు. ఎం ఈ ఐ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి వీ కృష్ణా రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంకు పది విద్యుత్ బస్సులను అందించేందుకు ఆశక్తిని కనపరుస్తూ రాసిన లేఖను టీటీడీ చైర్మన్ కు  అందచేశారు.

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో తిరిగే అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ఇప్పటికే ప్రణాళికలు రచించింది. భక్తులకు ఉచిత సేవలందించేందుకు 12 బస్సులను కొండ గుడి వద్ద నడుపుతున్నారు. ఈ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ఈ విషయంలో ముందుగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ సీఎండీ ప్రదీప్ ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వాలని అభ్యర్థించానని ఆయన చెప్పారు. ఇప్పుడు మేఘా ఇంజినీరింగ్ సంస్థ ముందుకు వచ్చి రూ.15 కోట్ల విలువైన 10 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందజేసిందని టీటీడీ చైర్మన్ తెలిపారు. 

ఉచిత బస్సులతో పాటు తిరుమలలో తిరిగే ట్యాక్సీలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని యోచిస్తున్నట్లు సుబ్బారెడ్డి చెప్పారు. టాక్సీ డ్రైవర్లు ఈ ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయలేరు కాబట్టి, బ్యాంకులతో టైఅప్ చేయడం ద్వారా టిటిడి మద్దతు ఇస్తుందని ఆయన వివరించారు. 

వచ్చే ఏడాది మార్చి నాటికి పది బస్సులను టీటీడీకి అందిస్తామని ప్రదీప్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కంపెనీకి ఉన్నాయని, అందుకే గత 32 సంవత్సరాలుగా కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూనే ఉందని వెల్లడించారు. తొమ్మిది మీటర్ల పొడవు ఉండే ఈ ఎయిర్ కండీషన్డ్ బస్సులో డ్రైవర్‌తో కలిపి 36 సీట్లు ఉంటాయి.

ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్ చేసే ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతీ సీటుకు యూఎస్‌బీ సాకెట్ ఉంటుంది. లీథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్న ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్‌ లోడ్‌లను బట్టి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. హైపవర్‌ ఏసీ, డీసీ చార్జింగ్‌ సిస్టమ్‌ వల్ల బ్యాటరీ కేవలం మూడు గంటల్లోనే చార్జ్ అవుతుంది.