శాంతి భద్రతలు ఉంటేనే పర్యాటకం అభివృద్ధి

శాంతి ఉన్నప్పుడే పురోగతి సాధ్యమని, దీని కోసం పోలీసు వ్యవస్థ లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. విదేశీ పర్యాటకులకు తాము సురక్షితంగా ఉన్నామనే భావనను కల్పించినపుడే అంతర్జాతీయ పర్యాటకం భారత్‌లో వృద్ధి చెందుతుందని సూచించారు.
 
ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో బుధవారం కేంద్ర హోంశాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా నిర్వహించిన రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీల సదస్సులో ఓం బిర్లా మాట్లాడారు. పర్యాటకుల కోసం పోలీసు వ్యవస్థ ఒక డిజిటల్‌ యాప్‌ను రూపొందించాలని, దాని ద్వారా పర్యాటకులకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికేలా సమగ్ర సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు.
 

అంతకుముందు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ర్టాల అభివృద్థి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అతిథి దేవోభవ అన్న సూక్తిని తు.చ. తప్పకుండా పాటిస్తూ విదేశీ పర్యాటకులకు భద్రత కల్పించాలని చెప్పారు.  అప్పుడే వాళ్లు తమతమ దేశాల్లో భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రైవేటు కంపెనీలు పర్యాటక రంగంలో పెట్టుబడులతో వస్తే అన్నిరకాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
పర్యాటక ప్రాంతాల్లో భద్రత విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలని డీజీలు, ఐజీలకు కిషన్‌ రెడ్డి సూచించారు. హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వే ేస్టషన్లు, బస్‌ ేస్టషన్లు, వివిధ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.