బ్రిటన్‌ ఆర్థిక మంత్రిపై ట్రస్‌ వేటు, రిషి మద్దతు దారునికి ఆ పదవి

బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తప్పిస్తూ ఆ దేశ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ వివాదం కావటంతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ప్రధాని సూచనలతోనే తాను చాన్స్‌లర్‌ పదవి నుంచి తప్పుకొంటున్నానని క్వాసీ తెలిపారు. 

ఆయన 38 రోజులే ఆ పదవిలో కొనసాగారు. కాగా, ఆయన స్థానంలో క్యాబినెట్‌ మాజీ మంత్రి జెరేమీ హంట్‌ను నియమిస్తూ ట్రస్‌ నిర్ణయం తీసుకొన్నారు. కాగా, బ్రిటిష్‌ మార్కెట్లు కుదేలవుతున్న నేపథ్యంలో రిషి సునక్‌కు చాన్స్‌లర్‌ బాధ్యతలు అప్పగించాలని కన్జర్వేటివ్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

మరోవంక, కార్పొరేషన్‌ పన్నును 25 శాతానికి పెంచుతామని ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రత్యర్థి రిషి సునాక్‌ ప్రకటించగా 19 శాతం పన్నుకే తాను కట్టుబడతానని ట్రస్‌ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ హామీని విస్మరించి 25 శాతం పన్ను విధానానికే ఆమె మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక క్రమశిక్షణపై మార్కెట్లకు భరోసా కల్పించేలా తాను నిర్ణయాలు తీసుకుంటున్నట్లు శుక్రవారం హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 

ఇదిలా ఉండగా, క్వాసీపై వేటుకు పన్నుల కోత వ్యవహారమే కారణమని తెలుస్తున్నది. పన్ను కోతలపై సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ వల్ల మార్కెట్లు కుదేలవుతున్నట్టు చర్చ నడుస్తున్నది. డాలర్‌తో పోల్చితే పౌండ్‌ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీన్ని అరికట్టేందుకు ఇంగ్లండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రంగంలోకి దిగిన సమయంలోనే బడ్జెట్‌లో మార్పులు చేపట్టడమే సమస్యకు దారితీసిందని విశ్లేషకులు చర్చించుకొంటున్నారు. దానితో, పన్ను కోత నిర్ణయాన్ని ట్రస్‌ వెనక్కి తీసుకొవలసి వచ్చింది.

కాగా బ్రిటీష్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి పోటీ పడ్డవాళ్లలో హంట్ కూడా ఉన్నారు. మొదట పోటీలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత ఆయన రిషి సునక్‌కు మద్దతు ప్రకటించి పోటీనుంచి వైదొలిగారు.  ఇప్పుడు హంట్‌ను ఆర్థిక మంత్రిగా నియమించడం ద్వారా అధికార కన్సర్వేటివ్ పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చవచ్చని ట్రస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసమ్మతి వర్గంలో అధిక సంఖ్యాకులు రిషి సునక్ మద్దతుదారులే కావడం గమనార్హం.

వాస్తవానికి కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా యూకేలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకుంటోంది. ఈ అస్ధిరత నేపథ్యంలో క్వార్టెంగ్‌ గత నెల 23న ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌ అనంతరం మార్కెట్‌లో, రాజకీయంగానూ గందరగోళం తలెత్తింది. ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రధాని ట్రస్‌ చిక్కుల్లో పడ్డారు. ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.