16న 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ల ప్రారంభం

16న 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ల ప్రారంభం

ఆర్థిక సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకుపోయే క్రమంలో మరొక చర్య అన్నట్లు, ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అక్టోబర్ 16 ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫిరెన్సింగ్ మాధ్యమం ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ లను దేశ ప్రజలకు సమర్పణం చేయనున్నారు. ఈ సందర్భంలో ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా, మన దేశానికి స్వాతంత్ర్యం తాలూకు 75 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంలో దేశంలోని 75 జిల్లాలలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డిబియు)లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశంలో మూలమూలన డిజిటల్ బ్యాంకింగ్ తాలూకు ప్రయోజనాలను ప్రజలు అందుకొనేటట్లు చూడాలన్న ధ్యేయంతో ఈ డిబియులను ఏర్పాటు చేయడం జరుగుతోంది.

ఇవి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రయాస లో సార్వజనిక రంగంలోని 11 బ్యాంకు లు, 12 ప్రైవేటు రంగ బ్యాంకులు, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పాలుపంచుకొంటున్నాయి. ఈ డిబియులను బ్రిక్ ఎండ్ మోర్టార్ అవుట్ లెట్ ల ద్వారా నిర్వహిస్తారు.

అక్కడ ప్రజలకు పొదుపు ఖాతా ను తెరవడం, ఖాతా లో నిలవ ఉన్న నగదు ఎంత అనేది సరిచూసుకోవడం, పాస్ బుక్ లో లావాదేవీల వివరాలను అచ్చువేయడం, నిధుల బదలాయింపు, ఫిక్స్డ్ డ్ డిపాజిట్ లలో పెట్టుబడి పెట్టడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, జారీ చేసినటువంటి చెక్కుకు సంబంధించి సొమ్ము చెల్లింపును ఆపివేయాలంటూ ఆదేశించడం, డెబిట్ కార్డు కోసం గాని లేదా క్రెడిట్ కార్డు కోసం గాని దరఖాస్తు పెట్టడం, అకౌంట్ స్టేట్ మెంటును పరిశీలించడం, వివిధ పన్నులను చెల్లించడం, బిల్లుల ను చెల్లిలంచడం, నామినేశన్ ను సమర్పించడం మొదలైన అనేక వేరు వేరు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాల ను అందుబాటులోకి తీసుకు వస్తారు.

వినియోగదారులకు ఏమంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాంకింగ్ ఉత్పాదనలను, సేవలు ఏడాది పొడవునా వారి వీలును బట్టి పొందేందుకు డిబియులు తోడ్పడుతాయి. అవి డిజిటల్ ఫినాన్శల్ లిటరసీని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకువస్తాయి. మరీ ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో చైతన్యాన్ని, అలాగే తత్సంబంధిత జాగ్రత్త చర్యలను తీసుకొనే అంశాల లో వినియోగదారుల కు అవగాహనను కలిగించడంపై శ్రద్ధ తీసుకుంటాయి. 

అంతేకాక డిబియులు నేరుగా ఇవ్వజూపే సేవల పరంగాగాని లేదా బిజినెస్ ఫెసిలిటేటర్ లు/ కరస్పాండెంట్ ల సేవల పరంగా గాని వినియోగదారులకు ఏవైనా సమస్యలు తల ఎత్తేటట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి,రియల్ టైం ప్రాతిపదికన సహాయాన్ని అందించడానికి తగినన్ని పరిష్కార యంత్రాంగాలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా సమకూర్చుతాయి.