మరికొద్ది రోజుల్లో కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక ప్రకటన చేస్తూ ఎండీఆర్ చార్జీ సెస్స్ లేదా పన్ను కాదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలపై ఎలాంటి భారం ఉండదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఏమీ లేదని చెప్పారు. చెల్లింపుల వ్యవస్థ నిర్మహణకు బలోపేతానికి ఎండీఆర్ చార్జీలు ఉపయోగిస్తారని కేంద్ర మంత్రి వివరించారు.
యూపీఐ చెల్లింపుల వ్యవస్థతో ముడిపడ్డ సంస్థలే ఈ చార్జీలను పంచుకుంటాయని చెప్పారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై ఇప్పటికే వ్యాపారులు ఎండీఆర్ చార్జీలు చెల్లిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. కాబట్టి యూపీఐ ఎండీఆర్ చార్జీ కొత్తదేమీ కాదని ఆమె పేర్కొన్నారు. కస్టమర్లపై భారం పడుతున్నట్టు భావించకూడదని చెప్పారు. అక్టోబర్ 15 నుంచీ ఎండీఆర్ చార్జీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.
ఈ చార్జీని చెల్లింపుల విలువలో 0.4 శాతంగా ఎన్‌పీసీఐ ఖరారు చేసింది. రూ.2 వేలకు పైబడిన కొన్ని వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ఈ చార్జీ విధించనున్నారు. అంతేకాకుండా, ఈ చార్జీ గరిష్ఠంగా రూ.300 దాటకూడదని కూడా ఎన్‌పీసీఐ పేర్కొంది. ఇక అత్యవసర సేవలైన రైల్వే, టెలికం, ఫ్యూల్, ఇన్సూరెన్స్ వంటి విషయాల్లో ఎండీఆర్ చార్జీని రూ.5 కే పరిమితం చేశారు.
అంతేకాకుండా, చిన్న వ్యాపారాలకు నెలకు రూ.1 లక్షల వరకూ ఎండీఆర్ చార్జీలు కూడా ఉండవని ప్రభుత్వం పేర్కొంది. 96 శాతం వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపింది. ఎన్‌పీసీఐ చెప్పేదాని ప్రకారం, ఎండీఆర్ చార్జీలో 40 శాతం కస్టమర్‌కు చెందిన బ్యాంకుకు వెళుతుంది. 30 శాతం పేమెంట్ గేట్‌వేకు, 20 శాతం యూపీఐ యాప్‌కు, 10 శాతం స్పాన్సరింగ్ బ్యాంకుకు చెందుతాయి.
మరోవంక, యూపీఐ లావాదేవీలపై కేంద్రం విధించనున్న ఎండీఆర్‌పై అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను పాటించాలని వర్తక సంఘాలు నిర్ణయించాయి. ఈ నిరసనలో 500 సంఘాల వరకు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. ఆ రోజు వ్యాపారులు తమ క్యూఆర్ కోడ్లను, స్కానర్లను, సౌండ్ బాక్స్‌లను, ఇతర డిజిటల్ చెల్లింపు పరికరాలను నల్లని వస్త్రంతో కప్పి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలపనున్నారు.
ఈ నిరసన గురించి తాను దేశ వ్యాప్తంగా పలు వాణిజ్య సంఘాలతో మాట్లాడానని మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అధ్యక్షుడు రవీంద్ర మంగ్వే తెలిపారు. అఖిల భారత వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ధైర్యశిల్ పాటిల్ మాట్లాడుతూ రిటైల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ లాభంతో వ్యాపారాలు నిర్వహిస్తారని తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు చార్జీలు విధిస్తే వారి వ్యాపార నిర్వహణ భారమవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే తమ ఆందోళనను తీవ్రం చేస్తామని అఖిల భారత వంట నూనె వర్తకుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు శంకర్ థక్కర్ హెచ్చరించారు. రిటైల్ వ్యాపారుల సంక్షేమ సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, అఖిల భారత నగల వర్తకులు, స్వర్ణకారుల సమాఖ్య, అఖిల భారత వంట నూనె వ్యాపారుల ఫెడరేషన్ అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’కు మద్దతు తెలుపుతున్నాయి.
More Stories
బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు
‘ఫామ్ 6’లో చిన్న మార్పు ఎన్నికల కమిషన్ లో సృష్టించిన దుమారం
‘వారానికి 5 రోజుల బ్యాంకుల పని విధానం’ ప్రభుత్వ ప్రతిపాదనల్లో లేదు!