న్యాయం సులువుగా అందించేందుకు చర్యలు

ప్రజా జీవనం సులభతరం అయ్యేందుకు, వారికి న్యాయం సులువుగా అందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యాయం జరగడంలో ఆలస్యమవడం పెను సవాలు అని చెప్పారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. 

అఖిల భారత న్యాయ శాఖ మంత్రులు, న్యాయ శాఖ కార్యదర్శుల సమావేశం ప్రారంభం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో అనేక అనవసరమైన చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. అనవసర చట్టాలను రద్దు చేయడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసినట్లు తెలిపారు.

స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న చట్టాలు, అనవసర చట్టాలు ఇంకా చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయని పేర్కొంటూ వీటిని సమీక్షించాలని కోరారు. గుజరాత్‌లో సాయంకాలపు కోర్టులను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ దీనివల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గిందని చెప్పారు.  చట్టాలను రూపొందించేటపుడు, వాటిలో వాడే భాష సులువుగా ఉండేలా చూడాలని సూచించారు. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోగలగాలని చెప్పారు.

ప్రజలకు వేగంగా న్యాయం అందించడం నేడు దేశం ముందున్న ఓ పెద్ద సవాల్ అని చెబుతూ ప్రత్యామ్న్యాయ పరిష్కార మార్గాలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ లను బలోపేతం చేయడం గురించి ప్రస్తావించారు. 

స్థానిక భాషల ప్రాధాన్యాన్ని వివరించారు. కొన్ని దేశాల్లో చట్టాన్ని రూపొందించే సమయంలోనే అది ఎంత కాలం అమల్లో ఉంటుందనే అంశాన్ని కూడా నిర్ణయిస్తారని, ఆ దిశగా మనం కూడా కృషి చేయాలని తెలిపారు.  కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం కోసం న్యాయ వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతున్నాయని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో సుమారు 32 వేల కాంప్లియెన్సెస్‌ను తొలగించినట్లు చెప్పారు. విచారణ ఖైదీల పట్ల సానుభూతితో వీటిని పరిశీలించాలని తెలిపారు.

రెండు రోజుల పాటు జరుగబోయే ఈ సమావేశానికి చట్టం, న్యాయం మంత్రిత్వ శాఖ గుజరాత్ లోని ఏకతా నగర్ ఆతిథేయిగా వ్యవహరిస్తోంది. భారతదేశంలో చట్టం, న్యాయం వ్యవస్థకు సంబంధించిన అంశాల ను చర్చించడం కోసం ఒక ఉమ్మడి వేదికను అందించాలి అన్నదే ఈ సమావేశం ధ్యేయంగా ఉంది.