చమురు రంగ సంస్థల ఊతానికి రూ 22,000 కోట్లు

పలు కారణాలతో ఆర్థిక చిక్కుల్లో పడ్డ ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు కేంద్ర సాయం అందనుంది. 3 ప్రధాన పిఎస్‌యు చమురు సంస్థలకు ఒన్ టైం గ్రాంటుగా రూ 22,000 కోట్లను అందించే నిర్ణయానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 
 
గత రెండు సంవత్సరాలుగా చమురు సంస్థలు నష్టాలను చవిచూస్తూ వస్తున్నాయి. వ్యయంతో పోలిస్తే ఈ కాలంలో వంటగ్యాసు ఎల్‌పిజి సిలిండర్లను తక్కువ ధరకు విక్రయించడం వల్ల తలెత్తిన ఆర్థిక నష్టాలను పూడ్చేందుకు చమురు సంస్థల బలోపేతానికి ఈ సాయం ప్రకటించినట్లు కేంద్ర మంత్రి ఠాగూర్ తెలిపారు. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ( బిపిసిఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) సంస్థలకు ఈ సాయం అందుతుంది. గత రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో వంట గ్యాస్ ధరలు 300 శాతం పెరిగినా దేశీయ మార్కెట్‌లో ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే వినియోగదారుడికి అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. 
 
నష్టాల భర్తీకి ఈ మూడు సంస్థలు ఈ మొత్తాన్ని వినియోగించుకోవల్సి ఉంటుంది. 2020 జూన్ నుంచి 2022 జూన్ వరకూ కాలంలో తలెత్తిన నష్టాలను పూడ్చుకోవల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా వంటగ్యాసు ధరలు 300 శాతం వరకూ పెరిగినా ఇక్కడ వినియోగదారులపై దశలవారిగా విధించిన భారం మొత్తం 72 శాతంగానే ఉందని మంత్రి లెక్కలు తెలిపారు.
 
 సంబంధిత రాయితీల ప్రక్రియలతో ఈ మూడు పిఎస్‌యులు నష్టాలబాట పట్టాయి. ఇప్పుడు అందించేది ఒన్ టైం గ్రాంటుగా మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. 
 
గుజరాత్‌లోని టునా టెక్రా, దీన్‌దయాళ్ పోర్టులో రూ 4,243.64 కోట్ల వ్యయంతో కంటైనర్ టర్మినల్ అభివృద్ధి పనులను పిపిపి తరహాలో చేపట్టేందుకు వీలు కల్పించారు. సహకార రంగ వ్యవస్థలో మరింత పారదర్శకతకు ఉద్ధేశించిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టానికి చేపట్టిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపింది.