రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్

కేంద్ర ప్రభుత్వం నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాన్ని ఉత్పాదక బోనస్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో సంబంధిత నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 
 
కేబినెట్ భేటీ వివరాలను తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. అర్హులైన రైల్వే ఉద్యోగులక ప్రతి ఏటా దసరా లేదా దీవాళి పూజల సెలవులకు ముందు పిఎల్‌బిని ప్రకటించడం ఆనవాయితీ. పిఎల్‌బి అంటే 75 రోజుల వేతన మొత్తంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా ఈ మొత్తాన్ని ఉద్యోగులకు అందించనున్నారు. 
 
దీని మేరకు 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ అందుతుంది.  అయితే గరిష్టంగా ఎక్కువలో ఎక్కువగా అందే మొత్తం రూ 17,951గా ఉంటుంది. ఈ మొత్తం వివిధ కేటగిరీల ఉద్యోగులకు చెల్లిస్తారు.  ట్రాక్ నిర్వాహకులు, డ్రైవర్లు, గార్డులు, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్లు, హెల్పర్లు, కంట్రోలర్లు, స్టేషన్ మాస్టర్లు, పాయింట్స్‌మెన్లు, మినిస్టిరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి సిబ్బందికి ఈ బోనస్ వర్తిస్తుంది. 
 
ఈ బోనస్ చెల్లింపులతో ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం రూ 1,832.09 కోట్లుగా ఉంటుంది.  రైల్వే ఉద్యోగులకు బోనస్ నిర్ణయాన్ని పలు ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, కరోనా అనంతర చిక్కులు తలెత్తినప్పటికీ తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
 
నిర్ధేశిత విధివిధానాల ప్రాతిపదికన లెక్కకట్టే మొత్తం కన్నా ఇప్పుడు చెల్లింపు జరిగే వాస్తవిక పిఎల్‌బి రోజుల సంఖ్య ఎక్కువ అని తెలిపారు. రైల్వేల పనితీరు మెరుగుదల విషయంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఉత్పాదక ప్రాతిపదిక బోనస్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు.