భారత్ – చైనాల మధ్య ఇప్పట్లో నేరుగా విమానాలు సాధ్యం కావా!

చైనా అమలు చేస్తున్న కరోనా నిబంధనల కారణంగా సమీప భవిష్యత్తులో భారత్, చైనా మధ్య నేరుగా వెళ్లే విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. చైనాలోని విమానాశ్రయాలలో దిగే ప్రయాణికులలో ఎవరికైనా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిన ప్రతిసారీ హఠాత్తుగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ తన విధానాలను ఎప్పటికప్పుడు చైనా మార్చుకోవడం వల్ల చైనాకు నేరుగా ప్రయాణికుల విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఇప్పట్లో ఉండకపోవచ్చునని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

2019 చివరిలో వూహాన్‌లో మొదటి కరోనా వైరస్ కేసు వెలుగు చూసిన తర్వాత భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విమాన సర్వీసుల రద్దు వల్ల చైనాలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతోపాటు చైనాలో పనిచేస్తున్న భారతీయులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

మూడేళ్ల తర్వాత చైనా ఇటీవలే వ్యాపారులు, ఉద్యోగుల రాకపోకలను పునరుద్ధరించడానికి వీసాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో కరోనా  కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన దాదాపు 23 వేల మంది విద్యార్థులు, వీరిలో అత్యధికులు వైద్య విద్యార్థులు చదువులను కొనసాగించడానికి తిరిగి చైనాకు వెళ్లేందుకు సన్నాహాలు చేపట్టారు.

అయితే చైనాకు నేరుగా విమనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మూడవ దేశం మీదుగా చైనా చేరుకోవడం చాలా ఖరీదు వ్యవహారంగా మారడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడవ దేశం, ముఖ్యంగా హాంకాంగ్ మీదుగా చైనాకు కేవలం 100 మంది విద్యార్థులు మాత్రమే ఇప్పటివరకు వెళ్లగలిగినట్లు తెలుస్తోంది.

 ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మ‌రికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా న‌మోదు అవుతున్న‌ట్లు రికార్డులు ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు

 మరోవంక, చైనాలో అక్టోబ‌ర్ తొలి వారంలో జాతీయ సెలువులు దినాల‌ సమయంలో నిబంధనలను అధిగమిస్తూ ప్ర‌జ‌లు మాత్రం సెలవు రోజుల్లో తెగ తిరగడంతో  మ‌ళ్లీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న‌ట్లు తాజా రిపోర్ట్‌లు చెబుతున్నాయి.  కొన్ని ప‌ట్ట‌ణాల్లో సోమ‌వారం నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్లు ప్రారంభించారు.  మ‌రో వైపు వ‌చ్చే వారం నుంచి బీజింగ్‌లో క‌మ్యూనిస్టు పార్టీ స‌మావేశాలు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ముంద‌స్తుగానే లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.