బంజారాహిల్స్‌లో రూ. 2.4 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం

హైదరాబాద్ భారీ మొత్తంలో హవాలా సొమ్మును పట్టుబడింది. బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు బయటపడింది. 

డబ్బును తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు నగదును సీజ్ చేశారు. డబ్బుతో పాటు నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. రూ.2.4 కోట్ల హవాలా డబ్బుతో పట్టుబడ్డ కారును గుజరాత్ కు చెందిన వ్యాపారి వ్యాస్ నవీచంద్ర భోగిలాల్దిగా గుర్తించారు.

మార్వెల్ మెడోస్ అపార్ట్ మెంట్, రామ్ కోఠి అడ్రస్ తో కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెప్పారు.  నిందితులు బిజినెస్ నిమిత్తం ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు చెప్పినా అందుకు తగ్గ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే అక్టోబర్ 11న గాంధీ నగర్‌లో రూ.3.5 కోట్లు, అక్టోబర్ 9న  జూబ్లీహిల్స్‌లో రూ.2.49 కోట్లు, అక్టోబర్ 8న చంద్రాయన్‌గుట్ట వద్ద రూ.79 లక్షలు, అక్టోబర్ 7న వెంకటగిరిలో రూ.54 లక్షలు, సెప్టెంబర్ 29న రూ.1.24 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తం మీద గత పది రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 10 కోట్ల  హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున తరలిస్తున్న ఈ సొమ్ము ఎవరి ఆదేశాలతో తరలిస్తున్నారు? ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ప్రస్తుతం పట్టుబడుతున్న నగదు మునుగోడు ఉప ఎన్నిక కోసమే చేతులు మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా మరింత పెంచారు.