పెట్టుబడుల పేరుతో రూ. 903 కోట్లు మోసం చేసిన చైనా ముఠా

పెట్టుబడుల పేరుతో రూ. 903 కోట్లు మోసం చేసి, ఆ డబ్బును హవాల ద్వారా చైనాకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు  హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్ల‌డించారు.   

అరెస్టు అయిన వారిలో ఒకరు తైవాన్‌, మరొకరు చైనీయుడు ఉండగా, మిగతా వారు భారతీయులనితెలిపారు. చైనా దేశ‌స్థుడిని ఐబీ డిటెన్షన్‌ సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నారు. కంబోడియా దేశం అడ్డాగా భారతీయులకు కమీషన్‌ ఆశ చూపి కొందరు చైనీయులు భారతదేశంలో రహస్యంగా తమ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తూ భారీ ఎత్తున మన దేశ సంపదను కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న భారీ మోసాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారని ఆనంద్ వెల్లడించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వాహణ చట్టాన్ని (ఫెమా) నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి భారీ ఎత్తున్న ఈ కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడైనది. 

భవిష్యత్తులో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ దర్యాప్తులో భాగస్వాములు చేస్తామని సీపీ వివరించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ దేశ వ్యాప్తంగా రూ. 50 వేల కోట్ల వరకు చైనీయులు మన దేశ సంపదను దొచుకెళ్లి ఉంటారని అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

 హైదరాబాద్‌ పోలీసుల ప్రాథ‌మిక దర్యాప్తులో రూ. 903 కోట్లు, ఆర్‌బీఐ నుంచి అనుమంతి పొందిన రెండు ఫారెన్‌ మనీ ఎక్ఛేంజ్‌ల ద్వారా హవాల జరిగినట్లు వెల్లడయ్యిందని తెలిపారు.  ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుపుతున్నామని చెబుతూ విదేశాలతో కూడా ఈ కేసు ముడిపడి ఉందని చెప్పారు. ఈ కేసులో రూ.1.91 కోట్లు ఫ్రీజ్‌ చేశామని వెల్లడించారు.

తార్నాకకు చెందిన ఒక వ్యక్తి అధిక వడ్డీ ఆశతో గూగుల్ ప్లే స్టోర్ లోని లాట్సమ్  అనే యాప్ ద్వారా రూ.1.16 లక్షలను ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యాప్  నిర్వాహకుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు చేయగా ఆ డబ్బులు జమ అయిన అకౌంట్ ‘జిందై టెక్నాలజీ’ అనే కంపెనీ పేరు మీద ఉన్నట్లు తేలింది. దీనితో లింక్ అయి ఉన్న వీరేందర్ సింగ్ అనే వ్యక్తిని పుణెలో పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే తాను జాక్, జాకెన్ పి అనే ఇద్దరు చైనీయులు చెప్పినట్టుగా భారత్ లో పనిచేస్తున్నానని ఒప్పుకున్నాడు.