తిరుమ‌ల‌లో గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థ తిరుప‌తికి త‌ర‌లింపు

తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వ‌ర‌లో తిరుపతిలో చేపట్టనున్న‌ట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందిని చెప్పారు.  

శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. 

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌ ఎన్‌టిఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. 

అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయి. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తారు. 

ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ చేపడతయారు. అహ్మదాబాద్‌ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్‌ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చింది. త్వరలో భూమిపూజ చేస్తామని చెప్పారు. అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని వివరించారు.