రుషికొండ తవ్వకాలలో ప్రభుత్వం ఏదో దాస్తోందన్న హైకోర్టు

రిషికొండ అక్రమ  తవ్వకాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏదో దాస్తోందంటూ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అభివృద్ది పేరిట కొండలను కొట్టేస్తున్నారని, మరో వైపు అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంలో విభిన్న వైఖరులు ఏంటి? అని నిలదీసింది.
 
గురువారం హైకోర్టులో రిషికొండ అక్రమ తవ్వకాలు విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను కొట్టేస్తున్నారంటూ పేర్కొంది. మరో వైపు అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని విస్మయం వ్యక్తం చేసింది. 
 
ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ హైకోర్టు పేర్కొంది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని కమిటీ వేస్తే తమరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్‌ మూర్తి, అశ్వినీ కుమార్ హైకోర్టుకు తెలియజేశారు.
దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్‌‌లను న్యాయవాదులు కోర్టుకు అందజేశారు. అయితే తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు.  అయితే గూగుల్ మ్యాప్‌లు అబద్దాలు చెబుతాయా? అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు.
తాను అఫిడవిట్ దాఖలు చేస్తానని, అప్పటి వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు ఉందని న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది.  మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజా, నిజాలు తేలుస్తామని చెప్పిన హైకోర్టు. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.