ఢిల్లీలో దశాబ్దం లోనే రికార్డుస్థాయిలో వర్షం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కుంభ‌వృష్టి కురుస్తున్న‌ది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది. శ‌నివారం కుండ‌పోత వాన ఢిల్లీ న‌గ‌రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆదివారం వారం కూడా ఎడ‌తెగ‌కుండా వర్షం ప‌డుతూనే ఉంది. 
 
భారీ వ‌ర్షాల కార‌ణంగా ఢిల్లీలోని ప‌లు లోత‌ట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. ర‌హ‌దారులు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. అక్క‌డ‌క్క‌డ రోడ్ల‌పై భారీగా నీరు నిలువ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.సాధారణంగా అక్టోబరులో ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు.
 
 శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్ధాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత 24 గంటల్లో ఢిల్లీలో కురిసిన వర్షపాతం రికార్డు నెలకొల్పిందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పలావట్ ఆదివారం  తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఢిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురవలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటివరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందని చెప్పారు. 
 
ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయాయని పేర్కొన్నారు.ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడా లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
అయితే, సోమ‌వారం నుంచి ఢిల్లీలో వ‌రుణుడి ప్ర‌భావం కొంత మేర‌కు త‌గ్గ‌వ‌చ్చున‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. కాగా, ఢిల్లీలో కుంభ‌వృష్టిపై ట్విట్ట‌ర్‌లోనూ మీమ్స్ వ‌ర్షం కురుస్తున్న‌ది. వ‌ర్షం వ‌ల్ల బాలీవుడ్ మొద‌లు ఛాయ్‌, బ్రెడ్‌, ప‌కోడి వాలా వ‌ర‌కు ప్ర‌జ‌లంద‌రికీ సోష‌ల్ మీడియాలో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ద‌క్కింది.

ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ మెయ్‌న్ రుకేగా న‌హీ సాలా అనే మీమ్‌ను జ‌త‌చేశాడు. ఢిల్లీలో సీజ‌న‌ల్ వాట‌ర్ ఫాల్స్ వ‌చ్చాయ‌ని, ఢిల్లీ వాసులంతా ఫ్రీ కార్ వాష్ కోసం రోడ్ల‌పైకి వ‌స్తున్నార‌ని మ‌రో ట్విట్ట‌ర్ యూజ‌ర్ కామెంట్ చేశాడు.

 యుపిలో భారీ వర్షాలతో11 మంది మృతి 

మరోవంక, గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే భారీ వర్షాలు కురవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు నీటిలో మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత 24 గంటల్లో యుపిలో పిడిగులు పడి ఐదుగురు దుర్మరణం చెందారు. పిడుగుపాటుకు పదుల సంఖ్యలో పశువులు మృతి చెందాయి.