భూమి నుంచి విడిపోయిన ఉపగ్రహమే చంద్రుడు

భూమి నుంచి విడిపోయి ఏర్పడిన ఉపగ్రహమే చంద్రుడు అని శాస్త్రవేత్తల అంచనాను నిరూపించే సరికొత్త ఆధారాలు లభించాయని ఇస్రో తాజాగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలం పైకి సోడియం అణువులు చేరుతున్నాయని, అక్కడి మట్టి, రాతిశిలల నుండి నిరంతరం సోడియం అణువులు ఉపరితలంపైకి చేరుతున్నాయని కనుగొన్నారు. 

అందువల్లే చంద్రుడు వెలుగుతున్న తీరు ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నది.  ఈ విషయాన్ని తొలిసారిగా చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ బయటపెట్టింది. ఈ వివరాల్ని అధికారికంగా భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) తాజాగా మీడియాకు విడుదల చేసింది. 

అపొలో-11 ప్రయోగంతో (1969లో) చంద్రుడిపై అడుగుపెట్టిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, మరో ఇద్దరు వ్యోమగాములు అక్కడుుంచి మట్టి, రాళ్లను భూమి పైకి తీసుకొచ్చారు. దీంట్లో భూమిపైన మట్టి, రాళ్లలో ఉన్నట్టుగానే సిలికాన్‌, ఇతర ఖనిజాలున్నాయి. చంద్రుడి మట్టి, రాళ్లలో సోడియం చాలా తక్కువగా ఉంది. దీంతో భూమి నుంచి చంద్రుడు ఏర్పడ్డాడనే సిద్ధాంతానికి సవాల్‌ ఏర్పడింది.

ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తూ దీనికి కారణం తెలిసిందని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి మట్టి, రాళ్లలోని సోడియం అణువులు నిరంతరం అక్కడ ఉపరితలానికి చేరుతున్నాయి. అందువల్లే నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఇతర వ్యోమగాములు తెచ్చిన వాటిలో కాల్షియం మోతాదు ఎక్కువైందని, సోడియం తక్కువైందని ఇస్త్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.

సూర్యుడి నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల తాకిడికి చంద్రుడిపై మట్టి, రాతి శిలల నుంచి సోడియం అణువులు విడిపోయి  ఉపరితలంపైకి చేరుతున్నాయని, తద్వారా ఎక్సోస్పియర్‌ (అత్యంత బలహీనమైన , పలుచనైన వాతావరణం) ఏర్పడుతోందని అంచనా వేస్తున్నారు. 

అందువల్లే ఒక రకమైన వెలుగు, కాంతితో చంద్రుడు కనిపిస్తున్నాడని, దీనికి కారణం ఎక్సోస్పియర్‌లోని సోడియం అణువులేనని ఇస్రో పేర్కొన్నది. భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థ చంద్రుడు, బుధుడు వంటి చిన్న గ్రహాలపై లేదు. అక్కడున్నది విభిన్నమైనది.  భూ ఉపరితలం నుంచి అంతరిక్షంలో 600 కి.మీ దూరంలోనూ అత్యంత పలుచనైన, బలహీనమైన ‘ఎక్సోపియర్‌’ ఉంది. దీంట్లో హైడ్రోజన్‌, హీలియం, ఆర్గాన్‌ వంటి అణువులున్నాయి. ఇది ఒక అంచనా మాత్రమే. ఇక్కడి వాయువుల స్థితి కచ్చితమైన సమాచారం లేదు.

సౌర కుటుంబంలో చంద్రుడు, బుధుడు వంటి చిన్న చిన్న గ్రహాల చుట్టూ నిజానికి వాతావరణమనేదే లేదు. కానీ ఎక్సోస్పియర్‌ ఉందని నాసా కూడా భావిస్తోంది. ఇందులోకి సోడియం ఎలా చేరుతుందన్నది మొదటిసారి చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ వెలుగులోకి తీసుకొచ్చింది.  వివిధ గ్రహాలు, ఉపగ్రహాల ఎక్సోస్పియర్‌ ఎలా ఏర్పడుతోందన్నది అంచనా వేయటంలో తాజా పరిశోధన గొప్ప ముందడుగు లాంటిది. ఆ గ్రహాల ఉపరితలంపై ఆ వాయువులు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది తెలుసుకోవటం సులభతరం కానున్నది.