రష్యాపై యురోపియన్‌ యూనియన్‌ కొత్త ఆంక్షలు

రష్యా ప్రభుత్వంపై, ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని పెంచుతూ కొత్త ఆంక్షలను యురోపియన్‌ యూనియన్‌ ఆమోదించింది. ఈ మేరకు గురువారం ఇయు వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన వెలువడింది. తృతీయ దేశాలకు రష్యన్‌ చమురును రవాణా చేసేందుకు సంబంధించిన ధరలపై నియంత్రణను విధించింది. 

తృతీయ దేశాలకు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా పై మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యాకి చెందినా లేదా రష్యా నుండి ఎగుమతి అయ్యే ఉక్కు ఉత్పత్తులపై దిగుమతి నిషేధాన్ని ఇయు విస్తరించింది. చెక్క గుజ్జు, కాగితం, సిగరెట్లు, ప్లాస్టిక్స్‌, కాస్మొటిక్స్‌, ఆభరణాల పరిశ్రమలో ఉపయోగించే వస్తువులు అంటే విలువైన రాళ్లు, లోహాలు వంటి వాటిపై మరిన్ని ఆంక్షలు విధించారు. 

వస్తువుల విక్రయం, సరఫరా లేదా ఎగుమతి వంటి వాటిపై పౌర విమానయాన రంగం మరిన్ని ఆంక్షలు ఎదుర్కోనుంది. దీనికి తోడు, మరింతమంది వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించారు. వారిలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినవారు ఉన్నారు. నిర్దిష్ట రష్యా ప్రభుత్వానికి చెందిన సంస్థలు, లేదా సంఘాల బోర్డుల్లో ఇయు జాతీయులు ఎలాంటి పదవులను నిర్వహించరాదని కూడా స్పష్టం చేశారు. 

రష్యా ఆర్థిక వ్యవస్థను మరింతగా దెబ్బ తీయాలన్నది లక్ష్యంగా వుందని ఇయు దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ చెప్పారు. రష్యా ఎగుమతులు, దిగుమతుల సామర్ద్యాన్ని పరిమితం చేయడం, రష్యా ఇంధనంపై ఇయు ఆధారపడడాన్ని మరింత వేగంగా పరిమితం చేయాలన్నది లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. 

దీనిపై ఇయులో పోలెండ్‌ రాయబారి ఆండ్రెజ్‌ సదోస్‌ స్పందిస్తూ, ”ప్యాకేజీ మరింత బలంగా వుండవచ్చు. ఈ విషయంలో మాకు ఏకాభిప్రాయం అవసరం కాబట్టి, రష్యా తాజా దూకుడు చర్యలకు మేము ఈ బలమైన ప్రతిస్పందన వ్యక్తం చేయడం ముఖ్యం.” అని వ్యాఖ్యానించారు.