తిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి ఊరేగుతూ భక్తుల మనోరథాన్ని నెరవేర్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

ఆలయ వీధులలో మలయప్ప స్వామికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. రథానికి తాళ్ళు కట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.  వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, రాష్ట్ర మంత్రి  వేణుగోపాలకృష్ణ, టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు. 

మంగళవారం రాత్రి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీవారు కల్కి అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన వేడుక జరిగింది.  బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.