ఉచితాలను రాష్ట్రాల జీడీపీలో ఒక శాతానికే పరిమితం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉచిత పథకాలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీతో రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను కట్టడి చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఆయా సంక్షేమ పథకాలను రాష్ట్రాల జీడీపీలో ఒక శాతం, లేదంటే రాష్ట్రాలకు వచ్చే పన్నుల్లో ఒక శాతానికి పరిమితం చేయవచ్చని ఎస్‌బీఐ నివేదికలో పేర్కొంది.

ప్రస్తుతం తెలంగాణ  11.7 శాతం, సిక్కిం 10.8 శాతం, ఆంధ్రా 9.8 శాతం, రాజస్థాన్‌  7.1 శాతం, యుపి  6.3 శాతంగా ఇటువంటి హామీల అమలుకు ఖర్చు పెడుతున్నాయి. ఈ హామీల్లో దాదాపు 40 శాతం విద్యుత్ రంగం వాటా అయితే, ఇతర లబ్ధిదారులలో నీటిపారుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆహారం, నీటి సరఫరా వంటి రంగాలు ఉన్నాయి.

రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, ప్రభుత్వాలపై వాటి భారంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్స్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ నేతృత్వంలో నివేదిక రూపొందింది. ఈ నివేదికలో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌ల పరిస్థితులను ఉదహరించారు. మూడు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం, పెన్షన్‌ చెల్లింపుల్లో భారీగా తేడాలున్నట్లు తేలింది.

ఆయా రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయం, పెన్షన్‌ చెల్లింపులను పోల్చి చూసిన సమయంలో జార్ఖండ్‌ 217, రాజస్థాన్‌ 190, ఛత్తీస్‌గఢ్‌కు 207శాతం అధిక భారం ఉందంటూ నివేదిక పేర్కొంది. పెన్షన్‌ పథకంలో మార్పుపై ఆలోచిస్తున్న రాష్ట్రాలను చూస్తే వాటి పన్నులు, చెల్లింపుల మధ్య అంతరం ఎక్కువగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.

పాత పెన్షన్‌ విధానంలోకి తిరిగి వెళ్లాలని యోచిస్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య 450శాతం, గుజరాత్‌లో 138, పంజాబ్‌లో 242 శాతంగా తేడాలుండే అవకాశం ఉందని ఘోష్‌ నివేదిక పేర్కొంది.  తాజా సమాచారం ప్రకారం  బడ్జెట్‌ యేతర రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలు, గ్యారంటీలతో తీసుకున్న పలు రుణాలు 2022 ఏడాది రాష్ట్రాల జీడీపీలో దాదాపు 4.5శాతానికి చేరుకున్నాయని సౌమ్య క్రాంతి ఘోష్‌ నివేదిక పేర్కొంది.