కల్తీ మందుల కట్టడికి కేంద్రం కసరత్తు

దేశంలో వేగంగా పెరుగుతున్న కల్తీ మందుల తయారీ వ్యాపారం కట్టడి  చేయడానికై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.  ప్రజలను నకిలీ మందుల బారి నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. మెడికల్ షాపుల్లో నకిలీ మందులను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 

ఈ విధానం వల్ల వినియోగదారులు సులభంగా నకిలీ మందులేవో, అసలు మందులేవో గుర్తించవచ్చు. తొలి దశలో ఎక్కువగా వాడుకలో ఉండే 300 మందులను ఈ కోడ్ విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బార్‌కోడ్స్ లేదా క్యూఆర్ కోడ్స్‌ను ఆ మందుల ప్రైమరీ ప్యాకేజింగ్ లేబుల్స్‌పై ఉంచనున్నారు.

ఈ దశలో యాంటీబయాటిక్స్ , కార్డియాక్, పెయిన్ రిలీఫ్ పిల్స్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్‌పై … అవి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే స్ట్రిప్స్‌పై ఈ క్యూఆర్ కోడ్ ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంలో భాగంగా నకిలీ మందులను, అసలు మందులను వినియోగదారుడు సులభంగా నిర్ధారించుకొనే వీలు కలుగుతుంది.

వినియోగదారుడు మెడికల్ షాప్‌కు వెళ్లి ఈ 300 రకాల మందుల్లో ఏ ఒక్కటి కొనుగోలు చేసినా ఆ స్ట్రిప్‌పై లేదా బాటిల్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌కు వెళుతుంది. ఆ డ్రగ్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

ఐడెంటిఫికేషన్ కోడ్, ఆ డ్రగ్ జెనరిక్ పేరు, బ్రాండ్ పేరు, మ్యాన్యుఫ్యాక్చరర్ పేరు, అడ్రస్.. బ్యాచ్ నంబర్, ఆ మందు తయారైన తేదీ.. ఎక్స్‌పైరీ డేట్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నంబర్ కనిపిస్తాయి. ఆ కోడ్ ను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి మొబైల్ ఫోన్ ద్వారా వినియోగదారుడు ట్రాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పటికీ అమల్లోకి రావడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని తెలుస్తుంది. దీనితో మందుల ధరలు కూడా 3 నుంచి 4 శాతం వరకూ పెరిగే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటాబేస్ ఏజెన్సీని ఏర్పాటు చేసి సింగిల్ బార్‌కోడ్‌తో వినియోగదారుడు అది ఫేక్ మెడిసినో లేదా ఒరిజినల్ మెడిసినో తెలుసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.