దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు పెరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. “దేశంలో పేదరికం మన ముందు దెయ్యంలా నిలుస్తోంది. మనం ఈ రాక్షసుని సంహరించడం ముఖ్యం. 20 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారనేది మనల్ని చాలా బాధించాల్సిన అంశమే” అని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గుర్తు చేశారు.
స్వదేశీ జాగరణ్ మంచ్ స్వావలంబి భారత్ అభియాన్‌లో నిర్వహించిన వెబ్‌నార్‌లో మాట్లాడుతూ 23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.375 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని, దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగులున్నారని, శ్రామిక శక్తి సర్వే ప్రకారం మనలో నిరుద్యోగిత రేటు 7.6% ఉందని తెలిపారు.
పెరుగుతున్న ఆర్థిక అసమానత మరో ప్రధాన సమస్య అని పేర్కొంటూ ప్రపంచంలోని టాప్ 6 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అని చెబుతున్నారని, అయితే ఇది మంచి పరిస్థితినా? అని ప్రశ్నించారు. భారతదేశ జనాభాలో అగ్రశ్రేణి 1 శాతం మంది దేశ ఆదాయంలో ఐదవ వంతు (20%) కలిగి ఉన్నారని, అదే సమయంలో, దేశ జనాభాలో 50% మంది దేశ ఆదాయంలో 13% మాత్రమే కలిగి ఉన్నారని హోసబాలే చెప్పారు.
పేదరికం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి పరిశీలనలను ఉటంకిస్తూ, హోసబాలే ఇలా అన్నారు: “దేశంలో ఎక్కువ భాగం ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు, పోషకమైన ఆహారం అందుబాటులో లేదు. పౌర కలహాలు, నాణ్యత లోపించిన విద్య కూడా పేదరికానికి కారణం. అందుకే కొత్త విద్యా విధానానికి నాంది పలికారు. వాతావరణ మార్పు కూడా పేదరికానికి కారణం. కొన్నిచోట్ల ప్రభుత్వ అసమర్థత పేదరికానికి కారణం”.
పట్టణ ప్రాంతాలలో మాత్రమే ఉద్యోగాలు ఉండవచ్చనే ఆలోచనతో గ్రామాలను ఖాళీ చేస్తుండడంతో పట్టణ జీవితాలను నరకంగా మార్చి వేస్తున్నట్లు హోసబలే తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా, స్థానిక ప్రతిభను ఉపయోగించి గ్రామీణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని కరోనా సమయంలో మనం తెలుసుకున్నామని ఆయన గుర్తు చేశారు.
అందుకే స్వావలంబి భారత్ అభియాన్‌ను ప్రారంభించారని చెబుతూ మనకు అఖిల భారత స్థాయి పథకాలే కాకుండా స్థానిక పథకాలు కూడా అవసరం అని స్పష్టం చేశారు. వ్యవసాయం, స్కిల్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో దీన్ని చేయవచ్చని ఆయన సూచించారు. కుటీర పరిశ్రమను పునరుద్ధరించవచ్చని చెప్పారు.
అదేవిధంగా, వైద్య రంగంలో, స్థానిక స్థాయిలో చాలా ఆయుర్వేద మందులను తయారు చేయవచ్చని చెబుతూ స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకతపై ఆసక్తి ఉన్న వ్యక్తులను కనుగొనాలని హోసబాలే సూచించారు. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి, స్థానిక స్థాయిలో ఏమి సాధించవచ్చనే దానిపై కొన్ని సంఘాలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఆధునిక ఆర్థిక విధానాల వల్ల దేశం కోల్పోతున్న స్థానిక ప్రతిభకు మద్దతు ఇవ్వడం, చైతన్యం నింపడం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ పట్టణ కేంద్రంగా, సాంకేతిక ఆధారితంగా మాత్రమే ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సొంతంగా పరిశ్రమలు నెలకొల్పడం అవసరమని పేర్కొంటూ హోసబాలే ఇలా అన్నారు: “విద్యార్థులు కళాశాల తర్వాత ఉద్యోగాలను చూస్తూ ఉంటే… చాలా ఉద్యోగాలు సృష్టించబడవు. కాబట్టి ఉద్యోగార్ధులు ఉద్యోగ ప్రదాతలుగా మారేలా ప్రోత్సహించాలి. మనం అందుకు అవసరమైన కోసం వాతావరణాన్ని సృష్టించాలి”.
అన్ని పనులూ ముఖ్యమని, సమాన గౌరవం పొందాలని సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెబుతూ ఒక తోటమాలి తన పనికి గౌరవం పొందకపోతే, ఎవరూ ఆ పని చేయడానికి ఇష్టపడరని పేర్కొంటూ మన ఆలోచనలను మార్చుకోవాలని తెలిపారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం