ఉక్రెయిన్‌ నాలుగు భూభాగాలు రష్యాలో విలీనం

ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు శుక్రవారం రష్యాలో విలీనమయ్యాయి. ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు ఇక తమవేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని వెల్లడించారు. 

జపోరిజియా, ఖేర్సన్‌, లుహాన్క్స్‌, దెబెట్స్క్‌ స్వతంత్ర ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు పుతిన్‌ ప్రకటించారు. క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో జరిగిన వేడుకలో నాలుగు ప్రాంతాల అధిపతులు రష్యాలో విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో విస్తృతమైన భూభాగాన్ని బలవంతంగా విలీనం చేసుకోవడం ఇదనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఇకపై నాలుగు ప్రాంతాలపై ఏదైనా దాడి జరిగినా అది రష్యాపైనే దాడి పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15 శాతం భూభాగం రష్యాలో కలిసిందని పుతిన్‌ పేర్కొన్నారు. తమ భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. అందుకోసం తమ శక్తిసామర్ధ్యాలను పూర్తిగా వినియోగిస్తామని పేర్కొంటూ అణ్వాయుధాల ప్రయోగానికి సహితం వెనుకాడబోమని సంకేతం ఇచ్చారు. 

ఉక్రెయిన్‌ నుండి క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న ఎనిమిదేళ్ల అనంతరం  జపోరిజియా, ఖేర్సన్‌లకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ భూభాగాలు ఎప్పటికి ఇక రష్యాలో భాగంగానే కొనసాగుతాయని ఈ సందర్భంగా పుతిన్ స్పష్టం చేశారు.

నాలుగు రోజుల క్రితం ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికంగా 99 శాతం మంది రష్యాలో విలీనమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైనది. ప్రజలు స్వేచ్ఛగా తమ ‘చారిత్రక మాతృభూమి’ కి తిరిగి రావడానికి ఎంచుకున్నారని మాస్కో పేర్కొంది.

అయితే, పుతిన్‌ ప్రకటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. పుతిన్‌ ప్రకటన పనికిరానిదంటూ కొట్టిపడేశారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరని చెప్పారు. ఈ వేడుకను ‘క్రెమ్లిన్‌ వీపరీత చర్య’ గా ఉక్రెయిన్‌ ఖండించింది. ఉక్రెయిన్‌పై ఏడు నెలల పాటు కొనసాగించిన సైనిక చర్యలను మరింత ఉథృతం చేసి, ఊహించలేని కొత్త దశలోకి తీసుకెళ్లనున్నారని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.

 ఉక్రెయిన్ ప్రభుత్వం, పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఈ రిఫరెండంలను ఖండిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజలతో బలవంతంగా రిఫరెండంలో పాల్గొనేట్టు చేశారని, ఏకపక్షంగా రిఫరెండం చేపట్టారని ఆరోపించాయి. అయితే, పుతిన్ మాత్రం ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందని, వారు రష్యాలో కలిసేందుకే మొగ్గుచూపారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఐక్యరాజ్యసమితి నియమావళి ఆర్టికల్-1ను కూడా ఉదహరించారు.