విజయవాడ, కర్నూలుకు తరలనున్న విశాఖ సీబీఐ కోర్టు

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు సంగతమే గానీ విశాఖలోని సీబీఐ కోర్టులను మాత్రం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోనున్నాయి. విశాఖ‌పట్నంలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులను విజయవాడ, కర్నూలుకు మార్చనున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు  కీల‌క నిర్ణయం తీసుకున్నది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఏపీ హైకోర్ట్ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. ఏపీకి సంబంధించి సీబీఐ కేసులు ఇప్పటివరకు విశాఖలోని సీబీఐ కోర్టులోనే విచార‌ణ‌కు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల కేసుల‌ను కూడా విశాఖ‌ సీబీఐ కోర్టే విచారిస్తున్నది.

దాంతో విశాఖ‌ సీబీఐ కోర్టుల‌పై భారం తగ్గించేందుకు రెండు కోర్టులను విజ‌య‌వాడ‌, క‌ర్నూలుకు త‌ర‌లిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. విశాఖ‌లో ఒక‌టో అద‌న‌పు సీబీఐ కోర్టును అలాగే కొనసాగిస్తుండగా  రెండో అద‌న‌పు సీబీఐ కోర్టును క‌ర్నూలుకు, మూడో అద‌న‌పు సీబీఐ కోర్టును విజ‌య‌వాడ‌కు త‌ర‌లించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు హైకోర్టు పాలక రిజిస్ట్రార్ విశాఖ‌లోని ప్రిన్సిప‌ల్ జిల్లా సెష‌న్స్ జ‌డ్జీకి ఆదేశాలిచ్చారు.

అమరావతిలోని హైకోర్టును కర్నూలుకు తరలించాలని న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలుకు సీబీఐ కోర్టును తరలించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 

నంద్యాలలో రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో సీఎం జగన్‌ను పలువురు న్యాయవాదులు కలిశారు. కర్నూలుకు హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వారు జగన్‌ను కోరారు. ఈ మేరకు జగన్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు.