విజయనగరం సామ్రాజ్యం ఏర్పర్చిన విద్యారణ్యులు

 
బి. నరసింహమూర్తి
హంపి – విజయనగరం –2

 
కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు కేంద్రంగా విలసిల్లింది. పశ్చిమాసియా దేశాల నుండి భారత్ ను ఆక్రమిస్తున్న విదేశీ ముస్లిం మూకలను చాలా కాలం దక్షిణ భారత ఆక్రమణలకు అడ్డు కట్టగా ఉంది. ప్రతాప రుద్రుడి పరాజయంతో ఆ కోట గోడలు బద్దలయ్యాయి. ఆ ఆక్రమణను తట్టుకోలేని మాధవా చార్యుడు తీవ్ర పరితాపంతో ఓరుగల్లు విడిచి దక్షిణానికి పయనమయ్యాడు. 
 
తిరిగి హిందూ సామ్రాజ్యం విలసిల్ల జేయాలని సంకల్పించాడు. అలా వస్తూ తుంగభద్ర తీరమైన హంపి ప్రాంతానికి వచ్చాడు. అడవులు, గుట్టలతో నిండి ఉండిన అక్కడ ఒక విచిత్ర సన్నివేశం చూసాడు. వేట కుక్కలను ఆ ప్రాంతంలోని కుందేళ్ళు తరిమాయి.
 
ఇదే వీర గడ్డ తన సంకల్పానికి ఆధారం అని నిశ్చయించాడు. అక్కడ పరమ శివుడు సతీదేవి వియోగం తరువాత తపమాచరించిన ప్రదేశంగా గ్రహించాడు. తానూ తల్లి భువనేశ్వరీ దేవి తపమాచరించాడు. అమ్మ ప్రత్యక్షమైనది. సైనిక సేకరణకు తనకు ధనాన్ని ఇమ్మని వేడుకున్నాడు. అది తాను మరో జన్మ ఎత్తితేనే ఇస్తానంది.
 
మరోజన్మ ఎత్తడం అంటే‌ – ధర్మ సూక్ష్మాలను వెతికాడు. శృంగేరీ వెళ్ళాడు. అక్కడ సన్యాసం స్వీకరించాడు. మాధవాచార్యులు విద్యారణ్యులుగా మారారు. సన్యాసం అంటే పునర్జన్మగా చూపి అమ్మవారిని ప్రార్థించాడు. సంకల్ప శక్తికి ముగ్ధురాలైన ఆదిపరాశక్తి కనక వర్షం కురిపించింది.  సరిగ్గా అదే సమయంలో కాకతీయుల ధనాగార నిర్వాహకులైన హరిహర రాయలు, బుక్కరాయలు బలవంతాన ముస్లిములుగా మార్చబడి బాధతో హంపీ క్షేత్రం చేరుకున్నారు. విద్యారణ్యులు వారిని తుంగభద్ర స్నానం చేయించి తిరిగి హిందువులుగా పరావర్తనం చేయించారు.
 
వారికి ఆ ధనరాశిని‌ అప్పగించి సైన్య సేకరణ చేసి రాజ్యమేర్పరచాలని ఆదేశించారు. విద్యారణ్యుల ఆదేశాన్ని ఆనందంగా స్వీకరించి వారు అక్కడ ప్రశస్త హిందూ సామ్రాజ్యంను సుమారు 900 ఏళ్ళ క్రితం  ఏర్పరిచారు. అదే విజయనగర సామ్రాజ్యం (1336-1646). వారిని సంగమ రాజవంశంగా గుర్తించారు. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మూడు తరాల పాలకులకు మార్గదర్శిగా నిలిచారు.
దక్షిణ భారత చరిత్రను అత్యంత కీలక సమయంలో ప్రభావితం చేసిన గొప్ప చారిత్రక వ్యక్తిత్వం ఆయనది. భారతదేశ చరిత్రలో స్వామి విద్యారణ్యునికి సమాంతరంగా ఒకే ఎక్కారు ఉన్నారు. ఆయన మహారాష్ట్ర రాష్ట్రంలో నివసించిన సంత్  రామదాస్. ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మిక మార్గదర్శి,.రామదాస్ ప్రేరణతోనే శివాజీ  మహారాష్ట్రలో దుష్ట చక్రవర్తి ఔరంగజేబు ఏలుబడిలో 17వ శతాబ్దంలో  స్వతంత్ర హిందూ మరాఠా రాజ్యాన్ని స్థాపించాడు.
 
ఆ తర్వాత సాళువ రాజవంశం, తుళువ, ఆరవీడు రాజవంశాలు ఆ ప్రదేశాన్ని పాలించాయి. తుళువ వంశంలో దక్షిణాపథమంతా, ఒరిస్సా తో కలుపుకుని ఏలిన రాజపుంగవుడే శ్రీ కృష్ణ దేవరాయలు. విద్యారణ్యుడు శృంగేరి శారద పీఠం (శృంగేరి మఠం)  జగద్గురువు.   సర్వదర్శన సంగ్రహం, శంకర దిగ్విజయ గ్రంధాల రచయిత. శృంగేరి కథనాల ప్రకారం, విద్యారణ్య భారతీ తీర్థకు అన్నయ్య. ఆయన కంటే ముందు ఆయన శృంగేరి ఆచార్యుడిగా ఉన్నారు. విద్యారణ్య అనేక గ్రంథాలను అందించారు.