`నమస్తే తెలంగాణ’ ప్రతులు దహనం చేసిన మహారాష్ట్ర రైతులు

తెలంగాణ సీఎం కేసీఆర్​ దేశ ప్రధాని కావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు టీఆర్ఎస్​కు చెందిన పత్రిక ‘నమస్తే తెలంగాణ’లో ‘కేసీఆర్‌ ఓ ఫైటర్‌’ శీర్షికన సోమవారం ప్రచురించిన కథనంపై మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకు చెందిన మేడిగడ్డ ముంపు బాధిత రైతులు మండిపడ్డారు. తమను సంప్రదించకుండా అభిప్రాయాల పేరిట తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహిస్తూ ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు.

ర్‌ ఓ ఫైటర్‌’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో సోమవారం ప్రచురించిన కథనంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను జాతీయరాజకీయాల్లోకి రావాలని తాము కోరుకోలేదని, అయినా తమ ప్రమేయం లేకుండా తమ అభిప్రాయాలను ప్రచురించడం ఏమిటని ప్రశ్నించారు.

‘మేడిగడ్డ బ్యారేజీతో మా పొలాలన్నీ మునుగుతుంటే చూస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను గ్రేట్ అని ఎట్లా అంటం.. ఆయనను పీఎం కావాలని ఎట్లా కోరుకుంటం.. ఆ పేపర్లన్నీ జూటా మాటలు రాసిన్రు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ సిరోంచ తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు.

పైగా, అరుడ, మద్దికుంట సర్పంచ్ ల ఫొటోలతో సహా ప్రచురించారని,  కానీ తాము ఎలాంటి మాటలు చెప్పలేదని అంటూ తమ ఫొటోలు తీసుకొని తమను సంప్రదించకుండానే ఇష్టమున్నట్లు ప్రచురించారని సర్పంచులు, గ్రామస్తులు మండిపడ్డారు.

మహారాష్ట్ర వైపు మేడిగడ్డ బ్యారేజీ వల్ల 2 వేల ఎకరాలు ముంపునకు గురైతే  నష్ట పరిహారం ఇవ్వని తెలంగాణ సీఎంను ఎట్లా దేశానికి పీఎం కావాలని కోరుకుంటామని నిలదీశారు. పత్రిక యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్టోబర్ 3 లోగా ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మేడిగడ్డ బ్యారేజీ పై ధర్నా చేస్తామని హెచ్చరించారు

‘నమస్తే తెలంగాణ’ కథనంలో అభిప్రాయాలు వెలిబుచ్చినట్లుగా పేర్కొంటున్న రైతులు రంగు బాపన్న (అరుడా గ్రామ మాజీ ఉప సర్పంచ్‌), రాయిళ్ల పాపయ్య (మద్దికుంట మాజీ సర్పంచ్‌), రమేష్‌ (ఆసరెల్లి సర్పంచ్‌), తోకలవార్‌ సంపత్‌ కుమార్‌ (సిరొంచ కౌన్సిలర్‌)లు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ ముంపు బాధితులే కావడం గమనార్హం. బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ వల్ల తమ పంటలు నీట మునుగుతున్నాయని కొంతకాలంగా ఉద్యమిస్తున్న రైతుల్లో వీరూ ఉన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తాము ఎంతో నష్టపోతున్నామని, 15 గ్రామాల రైతులం పంటలు పండించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తెలంగాణ ప్రభుత్వం తమకు పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్‌ పనితీరు వల్ల నష్టపోతున్న తాము ఆయన పాలనను ఎలా సమర్థిస్తామని ప్రశ్నించారు.