పిఎఫ్ఐపై నిషేధంపై కేంద్రం కసరత్తు!

ఈ నెల 22న 15 రాష్ట్రాలలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కు చెందిన కార్యకర్లలు, నాయకుల ఇళ్లపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో యుఎపిఎ చట్టం కింద ఆ పార్టీని నిషేధించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిద్ధపడుతోంది. ఇప్పటికే 42 పార్టీలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టంలోని సెక్షన్ 35 కింద వేటువేసిన హోం శాఖ తాజాగా ఇస్లామిక్ కార్యకలాపాల పేరిట ఉగ్రవాద శిక్షణ శిబిరాలును నిర్వహిస్తోందన్న ఆరోపణపై పిఎఫ్‌ఐను నిషేధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక యువకులను చేర్చుకుని అల్ ఖైదా, జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు పంపేందుకు ఉగ్రవాద శిక్షణను పిఎఫ్‌ఐ అందచేస్తున్నట్లు ఇప్పటికే ఎన్‌ఐఎ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలు, పిఎఫ్‌ఐ నాయకుల అరెస్టు దరిమిలా జరిగిన హింసాత్మక సంఘటనలను అధ్యయనం చేసి పిఎఫ్‌ఐ నిషేధానికి సిఫార్సు చేయాలని ఎన్‌ఐఎ యోచిస్తోంది.

మరోవంక, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాథపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విదేశాల్లోనూ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసినట్లు గుర్తించింది. రూ. 120 కోట్ల నిధులపై కూపీ లాగుతున్నారు అధికారులు. అబుదాబిలో ఉన్న దర్బార్ హోటల్ లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా తేజస్ అనే పేపర్ ను పీఎఫ్ఐ నడిస్తోంది.

తేజస్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్న కేరళ పీఎఫ్ఐ నేత షఫీక్ ను పోలీసులు మూడ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ భారీగా వసూలు చేసినట్లు గుర్తించారు. గల్ఫ్ నుంచి భారీగా ఫండింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఎన్ఐఏతో పాటు ఈడీ, ఆయా రాష్ట్రాల పోలీసులతో దర్యాప్తు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ లో 200 మంది యూత్ కు పీఎఫ్ఐ నాయకుడు అబ్దుల్ ఖధీర్ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. అయితే కేరళలోనే ఎక్కువ శాతం మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్ లో అరెస్టైన కార్యకర్తలను ఈడీ కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.