మరో మహా ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచం!

అమెరికాతో సహా మొత్తం ప్రపంచం మరో తీవ్రమైన ఆర్థిక మాంద్యం అంచున ఉన్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త నౌరీల్ రౌబి నీ హెచ్చరించారు. అంతేకాదు ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం దీర్ఘకాలం అంటే 2023 చివరి దాకా కొనసాగే అవకాశం ఉందని రౌ బిని మ్యాక్రో అసోసియేట్స్ సిఇఓ అయిన ఆ యన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు.
 
ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన 2008 అమెరికా ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే అంచనావేసి హెచ్చరించిన ఈ ఆర్థికవేత్త ఈ ఏడాది చివరలో అమెరికాలో మరో మహా ఆర్థిక మాంద్యం ప్రారంభం కాబోతున్నదని తాజాగా మరో హెచ్చరిక చేశారు. ఈ మాంద్యం సామాన్యమైనది కాదని.. అత్యంత దారుణంగా, దీర్ఘకాలంపాటు ఉండబోతున్నదని చెబుతూ పెట్టుబడిదారులు, ప్రజ లు సాహసాలకు పోకుండా సంపదను డబ్బు రూపంలో దాచుకోవాలని సూచించారు.
 
 తాజా ఆర్థిక మాంద్యంలో అమెరికా ప్రధాన మార్కెట్ సూచీ అయిన ఎస్‌అండ్‌పి 500 సూచీ దాదాపు 40 శాతం కా పడిపోవచ్చని కూడా ఆయన అంచనా వేశారు. భారీగా పెరిగిపోయిన కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాల అప్పుల నిష్పత్తిని చూస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అంటున్నారు.
 
వడ్డీ రేట్లు పెరిగి, రుణ సేవల ఖర్చులు పెరిగిపోయినప్పుడు కేవలం ప్రాణం మాత్రమే ఉండి నిస్తేజంగా మారిన చాలా సంస్థలు, కుటుంబాలు, కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు, షాడో బ్యాంకులు అంతేకాదు దేశాలు సైతం కుప్పకూలి పోతాయని ఆయన స్పష్టం చేస్తున్నారు.
 
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చైనా జీరో కొవిడ్‌ విధానం, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌-500 (ఎస్‌అండ్‌పీ-500) జాబితాలోని కార్పొరేట్‌ కంపెనీలకు పెరిగిన రుణభారం, అనేక దేశాలు విచక్షణారహితంగా స్థాయికి మించి అప్పులు చేయటం వంటి పరిస్థితులు మాంద్యం రావటానికి ప్రధాన కారణాలని వివరించారు. కంపెనీలు, దేశాల రుణ, వడ్డీల భారం పెరిగిపోవటం వాటి ఉత్పత్తి, నిర్వహణ సామర్థ్యంపై పడుతున్నదని తెలిపారు.
 
ఒకసారి ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకున్న తర్వాత ప్రభుత్వాలు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించే అవకాశాలు కూడా లేవని, ఎందుకంటే చాలా దేశాలు ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. అధిక ద్రవ్యోల్బణం ఉంటే ‘ఒక వేళ మీరు ఉద్దీపనలు అమలు చేస్తే అది మొత్తం డిమాండ్‌ను ఓవర్‌హీటింగ్ చేయడమే అవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
 
ఫలితంగా 1970లో మాదిరిగా స్తబ్దత నెలకొనడంతో పాటుగా ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో తలెత్తినట్లుగా తీ వ్రమైన రుణ సంక్షోభం నెలకొంటుందని కూడా ఇది స్వల్పకాలిక మాం ద్యంగా ఉండబోదని, దారుణమైన మాంద్యంగా ఉంటుందని పేర్కొన్నారు.