ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల నర్సయ్య మృతి

ఏబీవీపీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేయడంతో పాటు దశాబ్దాల పాటు వివిధ బాధ్యతలు నిర్వహించిన గుజ్జుల నర్సయ్య (80) శనివారం  మృతి 1942లో జన్మిచారు. చెందారు. నేటి జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం మండల గూడెం గ్రామంలో గుజ్జుల శాంతమ్మ, రాజమల్లయ్యలకు జన్మించిన ఆయన ప్రాథమిక విద్యభ్యాసం మండెలగూడెం, ఖిలాశాపూర్ గ్రామాలలో సాగింది. ఆలేరులో ఇంటర్ చదివి హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
 
 పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్మే ఇంగ్లీష్ పూర్తి చేశారు. పదేళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన 1967 నుండి ఎబివిపి కార్యకర్తగా పని చేశారు. 1981లో  జూనియర్ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు.  తర్వాత డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పదోన్నతి పొంది, తెలంగాణలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసి పదవీ విరమణ పొందారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయనకు ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. రాజమణితో వివాహం జరిగిన వారికి  ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
 
తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా అనేకమంది విద్యార్థి, యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆధ్యాత్మిక, విద్యార్థి ఉద్యమాలలో వీరి పాత్ర ఎనలేనిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, పరివార్ సంస్థల కార్యకర్తలపై నక్సలైట్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసినా, హత్యలు చేసిన వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని నింపుతూ వారి వెన్నంటి ఉండేవారు. స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థి, యువతలో చైతన్యం, స్ఫూర్తి, నర నరాన దేశభక్తిని పెంపొందించేవారు.
 
 తెలంగాణలో సామాజిక, కుటుంబ, ఆర్థిక సమస్యలు, కళాశాలల భాగస్వాముల మధ్య ఉండే విభేదాల పరిష్కారం కోసం అనేకమంది ఆయనను సంప్రదించేవారు.  విద్యార్థి పరిషత్ ఉద్యమాలు నిర్వహించినా, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినా వాటిని జయప్రదం చేయడంలో  కీలకపాత్ర వహించేవారు. 1987-1989 మధ్యకాలంలో రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరు పని చేశారు.
 
 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, విభాగ్ ప్రముఖ్ గా, సంభాగ్ ప్రముఖ్ గా, బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరివార క్షేత్రాలలోని వివిధ సంస్థలకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. పదవీ విరమణ పొందిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారు.
 
 అనేక స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలకు కూడా ఆయన  సేవలందించారు. 1980 దశకంలో నక్సలైట్ ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో, వారి సిద్ధాంతాలకు అడ్డు వచ్చిన వారిని హత్యలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా కూడా మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలలో చైతన్యాన్ని, స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపేవారు.
గత మూడు దశాబ్దాలుగా అనేకమంది ఎబివిపి కార్యకర్తలకు స్ఫూర్తికలిగిస్తున్నారని భారతీయ మంజూరు సంఘ్ జాతీయ సంఘటన అకార్యదర్శి బి సురేంద్రన్ ఆయన మృతిపట్ల విచారం వక్తం చేస్తూ నివాళులు అర్పించారు. జాతీయవాదం, దేశభక్తిల గురించి ఉద్వేగపూరిత ప్రసంగాలు చేస్తూ వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారని తెలిపారు.
 
విజ్ఞానఖని, కొన్ని దశాబ్దాలపాటు దిశానిర్ధేశం చేసిన రాజయోగి, ఉద్యోగ బాధ్యతలకు, సామజిక బాధ్యతలకు సమన్యాయం చేసిన ఆదర్శ స్వయంసేవక్ అని ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ బి దక్షిణామూర్తి ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. నరసయ్య పేరే ఎందరికి ప్రేరణ కలిగించిందని, ఒక మార్గదర్శిని కోల్పోయామని ఎబివిపి పూర్వ జాతీయ అధ్యక్షుడు ఫి మురళీమనోహర్ రావు నివాళులు అర్పించారు
 
నరసయ్య మృతి పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంతాపం ప్రకటించారు. తెలుగునాట విద్యార్థులలో జాతీయవాద భావజాల వ్యాప్తికి బీజాలు నాటిన మహనీయుడు నరసయ్య అని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆయన మృతి జాతీయవాదులందరికి తీరని లోటు అని సంజయ్ చెప్పారు.