డ్రగ్స్ కీలక సూత్రధారి జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

గోవా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను చేరవేస్తున్న కీలక సూత్రధారి  జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చెందిన 600 మంది కస్టమర్లు జాన్ స్టీఫెన్ డిసౌజా కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయని గుర్తించారు. వీరిలో 168 మంది హైదరాబాద్ వారేనని తేలింది.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పై జాన్ స్టీఫెన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తోంది. గోవా పోలీసుల సహకారంతో అతడిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.  ఇటీవల గోవాలో మృతి చెందిన  హర్యానా బిజెపి నాయకురాలు సోనాలి పోహ్గోట్ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు.

‘‘ గోవా లో డ్రగ్స్ కింగ్ పిన్ గా జాన్ స్టీఫెన్ డిసౌజా దందా చేస్తున్నాడు. హిల్ టాప్ రెస్టారెంట్ లో అతడి డ్రగ్స్ స్థావరం ఉంది. 1983 నుంచి ఆ రెస్టారెంట్ ను  జాన్ స్టీఫెన్ డిసౌజా నడిపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం అందులో స్పెషల్  పార్టీలు జరుగుతాయి. ఎంట్రీ ఫీజు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా ఉంటుంది” అని చక్రవర్తి తెలిపారు.

ట్రాన్స్  మ్యూజిక్, టెక్నో మ్యూజిక్ లతో పార్టీ లు ఏర్పాటు చేస్తారు. జాన్ స్టీఫెన్ డిసౌజాకు చెందిన ఏజెంట్లు డ్రగ్స్ ను అమ్ముతుంటారు. ఆ రెస్టారెంట్ కు వచ్చే టూరిస్ట్ లు డ్రగ్స్ కొని, వినియోగిస్తుంటారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారని వివరించారు. వారిని త్వరలోనే పట్టుకుంటాం అని డీసీపీ  చక్రవర్తి తెలిపారు.

హైదరాబాద్ లోని హబ్సిగూడ కాకతీయ నగర్ లో ఉండే గోవాకు చెందిన కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే జాన్ స్టీఫెన్ డిసౌజా సహా ఏడుగురి పేర్లు చెప్పాడని ఆయన పేర్కొన్నారు. కాళీ అందించిన సమాచారం ఆధారంగానే గోవాకు వెళ్లి ఆపరేషన్ చేశామన్నారు.

 ‘‘ఆగస్టు 16న ప్రీతీశ్ నారాయణ అలియాస్  బాబు అనే డ్రగ్ పెడ్లర్ ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నాం. 20 డ్రగ్స్ పిల్స్,4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , ఒక మొబైల్ ఫోన్ ,4వేల నగదు స్వాధీనం చేసుకున్నాం. ప్రీతీశ్ నారాయణ ఇచ్చిన సమాచారం కూడా దర్యాప్తులో ఎంతో కీలకంగా మారింది’’ అని డీసీపీ వివరించారు. 

ఇక హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని డీసీపీ గుమ్మి చక్రవర్తి  తెలిపారు.  వారిని ఘన దేశానికి చెందిన మసావే, నెల్లూరుకు చెందిన సుమంత్ గా గుర్తించారు. సుమంత్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు  డ్రగ్స్ తెచ్చి కస్టమర్ల కు అమ్మేవాడని చెప్పారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు విలువ చేసే  17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , సెల్ ఫోన్స్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.