నగదు బదిలీ ప్రభుత్వ అతిపెద్ద విజయం.. దళారుల నుంచి ప్రజలకు విముక్తి

ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నరేంద్ర మోదీ ప్రభుత్వ సాధించిన అతిపెద్ద విజయమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ పథకం మధ్యదళారుల కోరల నుంచి ప్రజలకు విముక్తిని ప్రసాదించిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపిక చేసిన ప్రధానమంత్రి మోదీ ప్రసంగాల సంకలనం ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సమస్యలను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను లోతుగా అర్ధం చేసుకునేందుకు ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్’ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ‘సర్వే జన సుఖినో భవంతు’ అనే విశాల దృక్పథంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన కొనియాడారు.

గతంలో కూడా అనేక మంచి పథకాలు అమలు జరిగాయని, మోదీ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో, లక్ష్యాలను నిర్ణయించుకుని పథకాలు అమలు చేసున్నదని ఆయన చెప్పారు. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలు జరుగుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలనిస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు.

“గతంలో భారతదేశం తన వాదనను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించేందుకు అవసరమైన స్థాయిలో లేదని చాలా కాలంగా ప్రజలు భావించారు అయితే, ప్రధాని మోడీ రాకతో భారతదేశం ఇప్పుడు బలమైన శక్తిగా మారింది. భారతదేశ వాణి ప్రస్తుతం అందరికీ వినిపిస్తుంది.” అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.గా నెరవేరిందని ఆయన గుర్తు చేశారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు, మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషి పుస్తకంలో ప్రతి అక్షరంలో కనిపిస్తుందని చెప్పారు. మరుగుదొడ్ల సౌకర్యం , మంచి నీటి సరఫరా అనే రెండు అంశాలు అత్యంత కీలక సమస్యలని, గత ప్రభుత్వాలు వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు.

ట్రిపుల్ తలాక్‌పై అంశాన్ని ప్రస్తావించిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేక శతాబ్దాలుగా అమలు జరుగుతున్న ఈ దురాచారాన్ని రద్దు చేయడం చిన్న విషయం కాదని చెప్పారు. ముస్లిం మహిళలకు హిందూ మహిళలతో సమానమైన హక్కులు కల్పించలేక పోయానని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిన నేతగా మోదీ గుర్తుండిపోతారని స్పష్టం చేశారు.  సంక్లిష్టమైన జాతీయ సమస్యలపై మోదీ ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు ప్రసంగాల ద్వారా తెలుస్తుందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. మోదీ ఆలోచించి అమలు చేస్తున్న విధానాల వల్ల ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిందని ఆయన గుర్తు చేశారు.