హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఎన్టీఆర్‌ను అవమానించడమే

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అకారణంగా ఎన్టీఆర్‌ పేరు తొలగించడం ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమే అని ఎన్టీఆర్‌ కుమార్తె, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా విమర్శించారు. ఇలా పేరు మార్చడం వెనకున్న ఉద్దేశాలను కూడా ప్రభుత్వం బయటపెడితే సంతోషిస్తామని ఎద్దేవా చేశారు.

ప్రజల జీవితాలను మార్పు తెచ్చేందుకు అనేక సంస్కరణలు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్‌ అని పురందేశ్వరి కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం బాధాకరమని తెలిపారు.  ప్రభుత్వం తక్షణమే జీఓ వెనక్కి తీసుకునేలా పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే, రాజశేఖర్‌రెడ్డిని తక్కువ నాయకుడిగా తాము భావించడం లేదని, ఆయనపట్ల అపారమైన గౌరవం ఉన్నదని ఆమె చెప్పారు.

ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకుల్లో వైఎస్సార్‌ కూడా ఒకరని తెలిపారు. కానీ, ఇవాళ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే యూనివర్శిటీ పేరు మార్చడం అనేది ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల ఆశయాలనూ జగన్ వమ్ము చేశారని ఆమె పేర్కొంటూ మద్య నిషేధం అన్నారని, కానీ ఇప్పుడు అది ఏరులై పారిస్తున్నారని పురందేశ్వరి దుయ్యబట్టారు.  జగన్‌ ప్రభుత్వం అప్పుల ప్రభుత్వమని ధ్వజమెత్తుతూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను రాష్ట్రంలో పక్కదారి పట్టించారని ఆమె విమర్శించారు. ఎపిలో రోడ్ల స్థితి అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. 

కాగా, రుషికొండకు జగన్‌ కొండ అని పేరు పెడతారేమో అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ పేరు మారుస్తూ తెచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు అవుతుందన్న విషయం మరిచిపోవద్దని హితవు చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.