2047 నాటికి వందశాతం దేశీ పరిజ్ఞానంతో నౌకా నిర్మాణాలే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ తెలిపారు. విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నిస్టార్ (11190), నిపుణ్ (11191) డైవింగ్ సపోర్టు వెసెల్స్ (డిఎస్‌విలు) ఆర్.హరికుమార్ సమక్షంలో ఆయన సతీమణి, నేవీ వెల్‌నెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు కళా హరికుమార్ చేతుల మీదుగా గురువారం జలప్రవేశం చేశాయి.
ఈ సందర్భంగా హరి కుమార్ మాట్లాడుతూ ఈ వెసెల్స్ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో 120 ఎంఎస్‌ఎంఇల సహకారంతో విశాఖ షిప్‌యార్డులో తయారయ్యాయని తెలిపారు. కొద్ది రోజుల కిందట విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి ప్రవేశించిందని గుర్తు చేశారు. ఆయా కీలక యుద్ధనౌకల నిర్మాణాలతో భారత నౌకాదళం ‘బిల్డర్స్ నేవీ’గా వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
1971లో భారత నౌకాదళంలో ప్రవేశించిన యుద్ధనౌక పేరు కూడా ఐఎన్‌ఎస్ నిస్టార్ అని, అదే సంవత్సరంలో జరిగిన ఇండో-పాక్ యుద్ధ సమయంలో విశాఖ తీరానికి చేరువలో మునిగిపోయిన పాక్ జలాంతర్గామి ఘాజీపై డైవింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంత పరిధిలోని మిత్ర దేశాల వారికి కూడా సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో భారతదేశం కీలక పాత్ర పోషించేందుకు డిఎస్‌విలు తోడ్పడతాయని చెప్పారు.
ప్రస్తుతం నౌకాదళ అవసరాల కోసం తయారు చేస్తున్న 45 యుద్ధ నౌకలు, 43 జలాంతర్గాములు మన దేశంలోనే తయారవుతున్నాయని తెలిపారు. వీటి తయారీతో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు.
2016వ నుంచీ హిందుస్థాన్ షిప్‌యార్డు వరుసగా లాభాలు ఆర్జిస్తోందని షిప్‌యార్డు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఖత్రీ తెలిపారు. ఒకేసారి రెండు నౌకలను జలప్రవేశం చేయించడం భారత నౌకాదళ చరిత్రలో ఇదే తొలిసారి అని కొనియాడారు. తాజా డిఎస్‌విలలో హల్‌డెక్ నౌక ముందు భాగంలో ఉండడం ప్రత్యేకతని పేర్కొన్నారు. ఒక్కో డిఎస్‌వి పొడవు 118.4 మీటర్లు, వెడల్పు 22.8 మీటర్లు, బరువు 9,350 టన్నులు, రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ నౌక గంటకు 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు.
లోతైన సముద్ర అంతర్భాగంలో చిక్కుకుపోయిన సబ్‌మెరైన్లు, ఇతర విలువైన పరికరాలను వెలికి తీయడానికి ఈ వెసెల్స్ ఎంతగానో సహాయపడతాయని పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, స్థానికంగా ఉపాధి కల్పించడానికి తగ్గట్టుగా ఈ రెండు డిఎస్‌విలను రూపొందించినట్లు తెలిపారు. స్ట్రాటజికల్ ఫోర్స్ కమాండ్ అధిపతి, వైస్ అడ్మిరల్ బిఆర్ పండిట్, తూర్పునౌకాదళధిపతి బిశ్వజిత్ దాస్ గుప్తా, కంట్రోలర్ వార్‌షిప్ ప్రొడక్షన్ అధికారి దేశ్‌ముఖ్ కూడా పాల్గొన్నారు.
More Stories
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం
పోలవరం పనులపై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
చివరకు తొక్కిసలాటపై క్షమాపణ చెప్పిన టిటిడి చైర్మన్