పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా 

టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్‌సభ మాజీ ఉప సభాపతి కరియ ముండా కూడా ట్రస్టీలుగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్‌ ఫండ్‌ బోర్డు ట్రస్టీల సమావేశం మంగళవారం జరిగింది. ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నామినేట్‌ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.
 
కాగా, పీఎం కేర్స్‌ ఫండ్‌కు సలహా బోర్డు ఏర్పాటు కోసం ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. మాజీ కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షా బోర్డు సలహాదారులుగా ఉండనున్నారు.
 
మరోవైపు పీఎం కేర్స్ ఫండ్‌కు హృదయ పూర్వకంగా విరాళాలు అందించిన దేశ ప్రజలను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు పీఎంవో కార్యాలయం బుధవారం పేర్కొంది. కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరును విస్తరిస్తుందని తెలిపారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని ఇస్తుందని చెప్పారు.
కీలక సమయాల్లో ఈ నిధి అందజేసిన సహాయాన్ని ట్రస్టీలు ధ్రువీకరించారు. పీఎం-కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 4,345 మంది బాలలకు అండగా నిలిచినట్లు ధ్రువీకరించారు.  అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే విశాల దార్శనికత ఈ నిధికి ఉందన్నారు. ఉపశమన చర్యల్లో సహాయపడటం మాత్రమే కాకుండా సామర్థ్య నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

2020లో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పీఎం-కేర్స్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫిషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దీనికి అందజేసే నిధులపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో తల్లిదండ్రులు/సంరక్షకులు/చట్టబద్ధ సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కరోనా కారణంగా మరణించినట్లయితే, అటువంటి వారి పిల్లలను సంరక్షించడం కోసం ఈ నిధిలో భాగంగా పీఎం-కేర్స్ ఫర్ చిల్డ్రన్  పథకాన్ని గత ఏడాది మే 29న ప్రారంభించారు.