ధరణి నిషేధిత జాబితా నుండి `మాఫియా’ చేతిలో వేయి ఎకరాలు

రంగారెడ్డి జిల్లా గండిపేటలో రూ.వేల కోట్ల విలువచేసే 1000 ఎకరాల వివాదాస్పద భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉండగా, ప్రగతిభవన్‌తో సంబంధమున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా పైరవీతో ఆ భూమి నిషేధిత జాబితా నుండి మార్చేశారని  బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణ చేశారు.
 
రాష్ట్రంలో భూదందా రూపకర్త, సృష్టికర్త, సీఎం కేసీఆరేనని, రాజధాని చుట్టుపక్కల వేల కోట్లు విలువచేసే భూములను అధికార పార్టీ ముఖ్యుల బినామీలు కబ్జా చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘ఒక భూమిలో కొంతభాగాన్ని రిజిస్ట్రేషన్‌ చేసి మిగతాభాగాన్ని కంప్యూటర్‌లో బ్లాక్‌ చేస్తున్నారు. బేరం కుదిరితే ఓపెన్‌ అవుతది.. లేదంటే క్లోజ్‌ అవుతది… ఇదీ ప్రతి రోజు జరుగుతున్న దందా.. ప్రాజెక్టుల్లో దండుకునే కమిషన్‌ల కంటే ధరణి ద్వారా పెద్దఎత్తున దందా జరుగుతోంది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎన్‌ఐసీలో నిక్షిప్తం చేయాల్సిన భూ రికార్డుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే నాలుగు సంస్థలను మార్చి, తాజాగా ఫిలిప్పీన్స్‌ కంపెనీ చేతుల్లో పెట్టిందని ఈటెల దుయ్యబట్టారు. ధరణిని రైతుల కోసం పెట్టారా? లేక.. వేల కోట్లు విలువజేసే భూమిని కేసీఆర్‌ కుటుంబసభ్యులు, ఆయన బానిసలు కొట్టేయడానికి పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు.
 
ధరణి లోపాల పుట్ట అని స్పష్టం చేస్తూ అసైన్డ్‌ భూములను వివాదాస్పద జాబితాలో పెట్టారని, దేవాదాయ, వక్ఫ్‌, మాన్యం భూములు వేల ఎకరాలను బినామీల పేరిట దండుకుంటున్నారని రాజేందర్ ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిన కేసీఆర్‌, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 2020 నవంబరులో ధరణిని తీసుకువచ్చారని మండిపడ్డారు.
 
 ధరణి కారణంగా భూసమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయని చెబుతూ సర్వేనెంబర్లు  తప్పుగా పేర్కొనడం, పట్టాభూముల్ని అటవీ భూములుగా మార్చడం, యజమానుల పేర్లు మారిపోవడం వంటి సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. రికార్డుల్లో తప్పులు సవరించాలని, తమకు న్యాయం చేయాలని గత రెండేళ్లుగా 24 లక్షల మంది రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘‘ఇప్పటికీ 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నై. తమ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక మహిళా తహశీల్దార్‌పై పెట్రోలు పోసి తగులబెట్టాల్సిన నీచమైన చరిత్రకు కేసీఆరే కారణం” అని  ఈటల ఆరోపించారు.  రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు వివాదాస్పద భూముల జాబితాలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిపాలన చేతగాదంటూ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవి నుంచి వైదొలగాలని ఈటల సీఎంను డిమాండ్‌ చేశారు.