అధికార అండదండలతోనే తెలంగాణలో చెలరేగుతున్న ఉగ్రవాదులు… వి హెచ్ పి

అధికార యంత్రాంగం అండదండలతోనే తెలంగాణాలో ఉగ్రవాదుల దేశద్రోహ చర్యలు సాగుతున్నాయని భావిస్తున్నట్లు విశ్వహిందూ పరిషద్ స్పష్టం చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎన్ఐఎ జరిపిన సోదాలలో పిఎఫ్ఐ కరాటే శిక్షణ పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడి కావడం పట్ల పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరి నాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వం భద్రతను విస్మరించి, ఉగ్రవాదులకు, అరచకత్వానికి బాటలు వేస్తోందని స్పష్టమైన్నట్లు వారు మండిపడ్డారు.  ప్రస్తుతం  చేసిన సోదాలతో సరిపెట్టకుండా, రాష్ట్రాన్ని మొత్తం జల్లెడ పట్టి ఉగ్ర మూలాలను పెకిలించాలని.. బాధ్యులను, వారికి సహకరిస్తున్న మద్దతుదారులను శిక్షించాలని ఎన్ఐఎ ను కోరారు. దాదాపు 40 కి పైగా ప్రాంతాలలో సోదాలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని ధ్వజమెత్తారు.
 
పైగా రాజకీయ కోణంతో పోలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, వారిని సోదాలు నిర్వహించకుండా అడ్డుకోవడం,పట్టుకున్న ఉగ్రవాద మూలాలున్న వ్యక్తులను వదిలేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారి చేతిలో ఏ విధంగా బంధీ అయిందో తెలిసిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
ఏది ఏమైనా ఉగ్రవాద మూలాలను పెకిలించి రాష్ట్ర ప్రజలకు, హిందూ సంస్థలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం విస్మరించరాదని పరిషత్ హెచ్చరించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావు లేకుండా పాలన కొనసాగించాలని సీఎం కేసిఆర్ కు హితవు చెప్పింది.
 
ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న హవాలా డబ్బు లావాదేవీల్లో దాగి ఉన్న ఇద్దరు తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టీ, వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లెక్కకు మించి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చట్ట పరంగా వివరాలు రాబట్టాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కడప కేంద్రంగా దశాబ్దాలుగా సాగుతున్న పీఎఫ్ఐ శిక్షణ శిబిరాలపై నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు.
 
పిఎఫ్ఐ అనే నిషేధిత సంస్థ దాదాపు 15 విభాగాలుగా విడిపోయి, ఎవరికి అనుమానం రాకుండా హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోంది. సేవా కార్యక్రమాల ముసుగులో.. కరాటే శిక్షణ పేరుతో ముస్లిం యువకులకు శిక్షణ ఇవ్వడం చూస్తుంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
అల్లర్లు సృష్టించడం.. గురిపెట్టి రాళ్లు విసిరితే ఒక్క పెట్టుకే తల పగిలి ప్రాణాలు వదలడం.. కత్తులతో కడుపులో పొడవడం.. ప్రాణాలు తీయడం వంటి అనేక హత్యల విషయంపై శిక్షణ ఇస్తున్నటువంటి యువకులపై తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతం అని పరిషత్ ప్రశ్నించింది.
గతంలో భాగ్యనగర్ మాత్రమే ఉగ్రవాదులకు అడ్డంగా ఉండేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్ర కరాటే వాదులకు స్థావరంగా మారిపోయిందని పరిషద్ ఆవేదన వ్యక్తం చేసింది.

 ఉగ్రవాదులకే పోలీసులు ఆశ్రయము కల్పిస్తుండటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెబుతూ హిందూ నాయకులను హతమార్చి, హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం విఫలమవుతోందని విమర్శించింది. తమకు అనుమానాలు రాకుండా పోలీసుల ఇళ్లలోనే స్థావరాలు ఏర్పరచుకొని విచ్ఛిన్నకర కార్యకలాపాలు కొనసాగించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది.
 
 హిందూ సమాజంలోకి చొచ్చుకెళ్ళి అల్లర్లు సృష్టించడం, అమ్మాయిలను ఎత్తుకెళ్లడం.. బలవంతంగా సాహిత్యం అందించడం.. మతమార్పిడులు చేయడం.. ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నటించి విద్విషాలు రగిలించే పనిలో ఉగ్ర మూఖలు నిమగ్నమై ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని మూడు నెలల క్రితమే విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే  ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కరాటే శిక్షణ పేరుతో నిజాంబాద్ లో అప్పట్లో దాదాపు 500 మంది శిక్షణ పొంది పరారయ్యారని, వారి వల్ల ముప్పు ఉందని పరిషద్ అప్పుడే హెచ్చరించిందని వారు గుర్తు చేశారు.  కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో పాటు సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకులు తమ విద్వేషపూరిత కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు ప్రశాంతంగా నిద్రపోవడం ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పనిగట్టుకుని భాగ్యనగరంలో మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని పరిషద్ ఆరోపించింది. అందులో భాగంగానే ఇటీవల మునావర్ ఫరుకి అనే ఓ హిందూ వ్యతిరేకిని తీసుకువచ్చి ప్రధానమంత్రి స్థాయిలో భద్రత కల్పించి, హిందువులను, హిందూ దేవి దేవతలను నోటికి వచ్చినట్టు తిట్టిపించిన ఘనత రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ కి దక్కుతుందని మండిపడ్డారు.
 
మునావర్ ఫరుకి భాగ్యనగర్ వచ్చిన సందర్భంలో రగిలించిన విద్వేషాల కారణంగా పరిషత్ నాయకులకు బెదిరింపు కాల్స్ వచ్చినా పట్టించుకోలేదని,  పైగా  పరిషత్ నాయకుల పైనే తెలంగాణ ప్రభుత్వం సుమోటగా కేసులు నమోదు చేయడం హిందూ వ్యతిరేక చర్యలో భాగం కాదా అని పరిషద్ నాయకులు ప్రశ్నించారు.