నందిగ్రామ్‌ స‌హ‌కార ఎన్నిక‌ల్లోమమతకు ఎదురుదెబ్బ

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. నందిగ్రామ్‌లోని ఓ స‌హ‌కార సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌మ‌తాబెన‌ర్జి నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. స‌హ‌కార‌ సంఘంలోని మొత్తం 12 స్థానాల‌కుగాను టీఎంసీ కేవ‌లం ఒక్క స్థానాన్ని మాత్ర‌మే ద‌క్కించుకుంది. మిగ‌తా 11 స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది.
 
నందిగ్రామ్‌లోని బెకూటియా స‌మ‌బాయ్ కృషి స‌మితి అనే స‌హ‌కార సంఘానికి ఆదివారం ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ ఊహించ‌ని రీతిలో ఓట‌మి పాలైంది. గ‌తంలో బెకూటియా స‌మ‌బాయ్ కృషి స‌మితి టీఎంసీ కంచుకోట‌గా ఉండేది. ఇప్పుడు బీజేపీ ఆ కోఆప‌రేటివ్ బాడీని సొంతం చేసుకుంది. 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌మ‌తాబెన‌ర్జి ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.
 
2021లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు మమతకు, ఆమె సారధ్యంలోని టీఎంసీకి గట్టి షాకిచ్చారు.  వాస్తవానికి సువేందు కూడా ఒకప్పుడు టీఎంసీ నేతయే. మమతకు కుడిభుజంగా ఉండేవారు.
 
అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు బీజేపీలో చేరి ప్రత్యర్థిగా మారారు. దీంతో మమత తాను చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తోన్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని సువేందు పోటీచేస్తున్న నందిగ్రామ్ నుంచి తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో సువేందు నెగ్గడంతో ఇక్కడ మమత పరాజయం పాలయ్యారు.
 
నందిగ్రామ్‌లో సువేందు అధికారి కుటుంబానికి గట్టిపట్టుంది. సువేందు తండ్రి శిశిర్ ఎంపీ. మన్మోహన్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరుడు దిబ్యేందు అధికారి కూడా ఎంపీ. వీరిద్దరూ తృణమూల్ ఎంపీలే అయినా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు.  మమతను మరోసారి ఓడించిన కమలనాథులు సంబరాల్లో మునిగిపోయారు. నందిగ్రామ్‌పై తమ పట్టు కొనసాగుతుండటంతో సువేందు కుటుంబ సభ్యులు కూడా తాజా ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. నందిగ్రామ్‌ ఇప్పుడే కాదు ఎప్పటికైనా సువేందు అడ్డాయే అని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.