రాణి ఎలిజబెత్‌ 2కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము

భారత ప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2కు నివాళులు అర్పించారు. లండన్‌ లోని వెస్ట్‌ మినిస్టర్‌ హాల్‌ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు బ్రిటన్‌ అధికారిక పర్యటనలో ఉన్నారు.

సోమవారం జరిగే క్వీన్‌ ఎలిజబెత్‌ అంతక్రియలకు ఆమె హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సమీపంలోని లాంకాస్టర్‌ హౌస్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 కోసం సంతాప  పుస్తకంపై  సంతకం చేశారు.

సోమవారం అంత్యక్రియలకు ముందు లండన్‌ లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ లో విదేశీ నేతల కోసం కింగ్‌ చార్లెస్‌ 3 ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కు హాజరయ్యారు. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 సెప్టెంబర్‌ 8న కన్నుమూశారు. 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌ యూకే దేశాధినేతగా, కామన్వెల్త్‌ దేశాల అధిపతిగా ఉన్నారు.

క్వీన్‌ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు 500 మందికి పైగా విదేశాలకు సంబంధించిన నేతలు హాజరుకానున్నారు. అమెరికా అథ్యక్షుడు బైడెన్‌ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల ప్రధానులు కూడా హజరుకానున్నారు. మొత్తంగా 2000 మంది ప్రముఖులు రాణి అంత్యక్రియలకు హాజరు కానున్నారు. రష్యా, బెలారస్‌, మయన్మార్‌, ఆప్ఘనిస్తాన్‌, సిరియా మినహా మిగతా దేశాలను బ్రిటన్‌ రాణి అంత్యక్రియల కోసం ఆహ్వానించింది.